కేసీఆర్ లాగే ఈ బీజేపీ సీఎంలు సృష్టించిన రికార్డ్ ఇది

Update: 2018-11-26 06:05 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. టీఆర్‌ ఎస్‌ ఎన్నికల గుర్తు కారు కాగా - కేసీఆర్‌ కు మాత్రం సొంతంగా కారు లేదని ఆయ‌న స‌మ‌ర్పించిన అఫిడ‌విట్లో వెల్ల‌డించారు. ఇలా అంద‌రి దృష్టిని త‌న అఫిడ‌విట్‌ పై ప‌డేలా చేసుకున్న జాబితాలో తెలంగాణ సీఎం ఒక్క‌రే లేరు -  మ‌రికొంద‌రు సైతం ఉన్నార‌ని తేలింది. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ లో ప్రస్తావిస్తూ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో గులాబీ ద‌ళ‌ప‌తితో పాటుగా - మ‌రో ముగ్గురు భార‌తీయ జ‌న‌తా పార్టీ సీఎంలు - ఓ కాంగ్రెస్ సీఎం కూడా...త‌మ‌కు కారు లేద‌ని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్నికల కమిషన్‌ కు ఇచ్చిన లెక్కల ప్రకారం అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అని తేలింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆస్తుల విలువ రూ.22 కోట్లు. కేసీఆర్‌ త‌న‌కు సొంతంగా కారు లేదని తెలిపారు. కారు లేని సీఎంల జాబితాలో కేసీఆర్‌ కు తోడుగా రాజస్థాన్‌ సీఎం వసుంధరారాజే కూడా ఉన్నారు. శతకోటీశ్వరులైన రాజవంశస్థురాలు వసుంధరా రాజే అఫిడవిట్‌ లో ఈ వివ‌రాలు పేర్కొన్నారు. బీజేపీకి చెందిన వసుంధరారాజే ఎన్నికల కమిషన్‌ కు తాజాగా(2018లో) సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.4.95 కోట్లు. వసుంధరకు కార్లు గానీ - సొంత ఇండ్లు గానీ లేవని తెలిపారు. 3 కిలోల బంగారం - 15 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. 2013లో ఎన్నికల కమిషన్‌ కు తెలిపిన ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ.3.66 కోట్లు.  ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి రమ ణ్‌సింగ్‌(బీజేపీ) తాజా ఆస్తుల విలువ రూ.10.82 కోట్లు. 2008లో ఆయన ఆస్తుల విలువ రూ.1.04 కోట్లు. అంటే..పదేండ్లలో ఆయన ఆస్తులు 10 రెట్లు పెరిగాయని అర్థం. ఈ సీఎం కూడా కారు లేద‌ని వెల్ల‌డించారు.

ఇక మ‌ధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(బీజేపీ) తాజా ఆస్తుల విలువ రూ.10.46 కోట్లు. 2013లో ఆయన ఆస్తుల విలువ రూ.6.27 కోట్లు. ఈయనకు కూడా సొంతంగా కారు లేదని తెలిపారు. ఆయన భార్య సాధనాసింగ్‌ పేరుమీద విదిశాలో 32 ఎకరాల భూమి ఉన్నది. ఈ దంపతులకు రూ.7.15 కోట్ల అప్పు ఉన్నట్టుగా తెలిపారు. మిజోరం సీఎం లాల్‌ తన్‌ వాలా(కాంగ్రెస్‌) ఆస్తుల విలువ రూ.7 కోట్లుగా చూపారు. అందులో రూ.3.10 కోట్ల విలువైన ఇల్లు కోల్‌ కతాలో ఉన్నట్టు తెలిపారు. మిజోరం రాజధాని ఐజాల్‌ లోనూ ఓ ఇల్లు ఉన్నట్టు తెలిపారు. 2 కోట్ల 80 లక్షల విలువ చేసే వ్యవసాయ క్షేత్రం ఉన్నట్టు తెలిపారు. ఇలా కీల‌క నేత‌లు - సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌మ‌కు క‌నీసం కారు కూడా లేద‌ని పేర్కొన‌డం ఓ ప్ర‌త్యేక రికార్డును సృష్టించింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News