వైసీపీ ఎమ్మెల్యేల చేరికలపై బీజేపీ మెలిక

Update: 2016-02-23 09:56 GMT
 నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని జోరు మీదున్న టీడీపీకి అనుకోని ఇబ్బంది ఎదురైంది. వైసీపీ నేతలను చేర్చుకుంటే ఆ పార్టీ అధినేత జగన్ ఇంతవరకు స్పందించలేదు కానీ టీడీపీ మిత్రపక్షం బీజేపీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. అందరి విషయాన్నీ పక్కనపెట్టి కేవలం విజయవాడ వెస్ట్ నియోజవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయంలో మాత్రం బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా జలీల్ ఖాన్ ను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించింది. దీంతో టీడీపీలో ఆలోచనలో పడింది. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తమ పార్టీలో చేరికల విషయం బీజేపీకి చెప్పాల్సిన అవసరం ఏముందని టీడీపీ నేతలు అంటున్నారు.
   
అయితే... జలీల్ ఖాన్ చేరికపై అభ్యంతరం చెబుతున్నది బీజేపీ రాష్ట్ర నేతలు కాకపోవడంతో టీడీపీ ఈ విషయాన్ని పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ... బీజేపీని అడగకుండా జలీల్ ఖాన్ ను ఎలా చేర్చుకుంటారని మండిపడ్డారు. ముస్లింలను అడ్డంపెట్టుకుని జలీల్ రాజకీయాలు చేస్తున్నారని... అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకునే ముందు తమను సంప్రదించాల్సి ఉందని ఆయన అన్నారు.
   
అంతటితో ఆగని శ్రీనివాస్ జలీల్ కు సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ సవాళ్ల సంగతి ఎలా ఉన్నా టీడీపీ సొంత వ్యవహారంలో తలదూర్చాలని ప్రయత్నిస్తున్న శ్రీనివాస్ విషయాన్ని టీడీపీ అధినేత సీరియస్ గా పరిగణించారని అంటున్నారు. ఆయనపై అధిష్ఠానానికి కంప్లయింట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. కాగా చివరకు చేరికల విషయంలో టీడీపీ నేతలనే కాదు బీజేపీ నేతలనూ బుజ్జగించాలో ఏమో అంటున్నారు టీడీపీ నేతలు.
Tags:    

Similar News