అప్పుడు వెంకయ్యనే శంకించాలేమో..?

Update: 2015-10-14 17:30 GMT
ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.... ఏపీ రాజధాని ప్రణాళిక సిద్ధం కాకముందే రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇచ్చిందని మరోసారి డప్పు కొట్టుకున్నారు.  రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, అలాగే పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని అలవాటైపోయిన హామీని మరోసారి గుప్పించారు. హామీల అమలు విషయంలో విపక్షాల ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు... 35 ఏళ్ల నుంచి పనులు చేయని కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మాట్లాడుతుంటే నవ్వొస్తోందని వెంకయ్య కౌంటర్లేశారు.

ప్రత్యేక హోదాపై రాష్ట్ర విభజనకు ముందు ఒకలా మాట్లాడి... ఇప్పుడొకలా మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు ఎంత కేంద్ర మంత్రయినా తాను ఏపీ ప్రజల్లో ఒకడినన్న విషయం మర్చిపోతున్నట్లున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారే కానీ, రాష్ట్ర ప్రజల తరఫున ఏపీకి ఇది కావాలని పట్టుబట్టి సాధించుకోలేకపోతున్నారు. దీంతో.... కేంద్రాన్ని శంకించవద్దని అంటున్న వెంకయ్యనే శంకించాల్సిన అవసరం కనిపిస్తోంది.

'''మైకు దొరికితే చాలు ఏపీకి కేంద్రం అది ఇచ్చింది... ఇది ఇచ్చింది అని చెప్పడమే కానీ... ఏపీకి ఏం కావాలి..... ఎంత నిధులు అవసరం... అందులో కేంద్రం ఇచ్చిందెంత... సముద్రంలో కాకిరెట్టంత అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఈ సత్యం వెంకయ్యకు తెలియకా....? కానే కాదు.. అందుకే నిజంగానే కేంద్రాన్ని శంకించనవసరం లేదు... చిత్తశుద్ధి లేని వెంకయ్యే శంకించాలి'' అని విమర్శకులు అంటున్నారు.
Tags:    

Similar News