తీపికబురంటూ.. ఈ సస్పెన్స్ ఏమిటి పెద్దమనిషి

Update: 2016-12-27 17:41 GMT
ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలీక దేశ ప్రజలు గుండెలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. ఊహాలకు అందని రీతిలో నిర్ణయాల్ని తీసుకుంటున్న మోడీ పుణ్యమా అని.. ఈ దేశంలో ఏదీ అసాధ్యం కాదన్న విషయం స్పష్టమైందని చెప్పక తప్పదు. అవినీతిపరులకు సినిమా చూపించేందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకుందని చెప్పినప్పటికీ.. ఘరానా పెద్దమనుషుల కంటే కోట్లాది సామాన్యులకే చుక్కలు కనిపిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తక్కువలో తక్కువ వేసుకుంటే రూ.3లక్షల కోట్లు ప్రభుత్వ బొక్కసంలోకి వచ్చేస్తాయని.. వాటితో మోడీ చేసే సంక్షేమ కార్యక్రమాలతో దేశంలో అభివృద్ధి ఎక్కడికో వెళ్లిపోతుందన్న మాటల్లో నిజం లేదన్న విషయం తేలిపోయింది.

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రజలకు షాకు మీద షాకు తగిలేలా.. రోజుకో నిర్ణయాన్ని తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. యాబై రోజుల కష్టంతో జీవితాంతం సుఖంగా ఉంటామని చెప్పిన మాటల్లో నిజం లేదన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనిచెప్పాలి. బ్యాంకుల్లో విత్ డ్రా కష్టాలు మరికొన్నేళ్లు తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.

నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆయన.. రానున్న రెండు రోజుల్లో ఒక తీపికబురు రానున్నట్లుగా వెల్లడించారు. అవినీతిపరులకు ఇబ్బందులు రెట్టింపు అవుతాయని.. బ్యాంకుల్లోకి వచ్చేదంతా వైట్ మనీ కాదని.. అక్రమార్కుల్ని పట్టుకొని తీరుతామని చెప్పారు. తీపికబురు అంటూ కొత్త సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న వెంకయ్య.. ఇప్పటికి ఇచ్చిన సర్ ప్రైజ్ లు సరిపోలేదని భావిస్తున్నారా ఏమిటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News