వెంకయ్య పొగడ్తలకు బాబుకే సిగ్గేసిందేమో!​

Update: 2016-01-11 10:10 GMT
విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్య‌ సదస్సు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌కు వేదిక‌గా మారుతోంది. సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు బ్రాండ్ అని అభివర్ణించారు. హైదరాబాద్‌ కు ప్ర‌స్తుత‌ బ్రాండ్ వాల్యూ రావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉన్నార‌న్న విషయం మరువొద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత తనను సుమారు 40 దేశాల బ్రాండ్ అంబాసిడర్లు కలిసి ఉంటారని, వారంతా వివిధ విషయాల గురించి చర్చించిన తరువాత చంద్రబాబు పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారని వెంక‌య్య‌నాయుడు వెల్లడించారు.

చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ వేల్యూ వేరని వెంక‌య్య‌నాయుడు కీర్తించారు. చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తార‌ని, ఆయన దూరదృష్టి భవిష్యత్ తరాలకు వెలుగునిస్తుందని పొగిడారు. భారత్‌ లో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారం ఉంటుందని వెంక‌య్య హామీ ఇచ్చారు. విశాఖ‌ప‌ట్ట‌ణంతో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని పేర్కొంటూ....యువ‌నేత‌గా ఉన్న‌పుడు తాను విశాఖ‌ప‌ట్ట‌ణంలో జైలుకెళ్లానని ఆత‌ర్వాత‌, ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి హోదాలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోవ‌డం ఆనందాన్నిస్తోంద‌ని వెంకయ్యనాయుడు త‌న జ్ఞాప‌కాలు చెప్పారు.

సాధారణంగా గుక్కతిప్పుకోకుండా మాట్లాడడం, అందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని కీర్తించ‌డంలో ముందుండే వెంకయ్యనాయుడు తాజాగా త‌న ప్రేమ‌నంతా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై చూపించ‌డంలో మ‌ర్మం ఏంట‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆరాతీస్తున్నాయి. తన వాగ్ధాటితో ఎంతటివారినైనా మంత్రముగ్ధులను చేయడంలో వెంకయ్యనాయుడు స్పెషలిస్టు. అలాంటి వెంకయ్యనాయుడు హ‌ఠాత్తుగా చంద్ర‌బాబును పొగుడుతున్నారంటే..నిజంగా రాష్ర్టం అభివృద్ధి, చంద్ర‌బాబుపై ప్రేమే కార‌ణ‌మా లేక "వ్య‌క్తిగ‌త‌" ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయా అనే టాక్ మొద‌లైంది.
Tags:    

Similar News