రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంట్రీ ఇచ్చారు. ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడుల నేపథ్యంలో తొలగింపునకు గురైన తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తాజా వ్యాఖ్యలపై వెంకయ్య మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. రామ్మోహన్ రావు పద్దతి మార్చుకుంటే బాగుంటుందని వెంకయ్యనాయుడు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రామ్మోహన్ రావును పదవిలో నుంచి తొలగించలేదనేది తాను పత్రికల్లో చూశానని చెప్పిన వెంకయ్య ఈ నేపథ్యంలో ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
పరిపాలన లేదా రాజకీయపరంగా తమిళనాడులో ఎమైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేరుగా కేంద్రంతో మాట్లాడుతారని వెంకయ్య స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి లేనపుడు ఎవరైనా ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తనపై కక్షగట్టారని రామ్మోహన్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. అలాంటి అవసరం ఎవరికి, ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఆరోపణల నేపథ్యంలో సంబంధిత అధికార వర్గాలు తమ పని తాము చేసుకుపోతున్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసుకోరాదని రామ్మోహన్ రావుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరోక్షంగా హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/