సొంతూరుకి స్మార్ట్ హోదా ఇవ్వలేదు

Update: 2015-09-13 08:59 GMT
సొంతూరు ఎవరికైనా సొంతూరే. స్థాయి ఏదైనా.. అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు సొంతూరికి ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటారు. మొదట సొంతూరు. తర్వాత సొంత జిల్లా.. ఆ తర్వాత సొంత రాష్ట్రం లాంటి భావనలు సహజమే. కొందరు తమను తాము ప్రపంచ పౌరులుగా చెప్పుకుంటారు కానీ.. సొంతూరు మీద అభిమానం ఉండే వారు చాలామందే ఉంటారు.

జన్మనిచ్చిన గడ్డకు ఎంతోకొంత సాయం చేయలేని బతుకు ఓ బతుకేనా అని ఫీల్ అవుతుంటారు. కానీ.. అలా చేయకపోవటాన్ని కూడా గొప్పగా చెప్పుకోవటం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికే చెల్లింది. ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో బెజవాడను స్మార్ట్ సిటీగా చేస్తామని గతంలో చెప్పారు కదా? అలా చేయలేదే అని అడిగి అడిగితే.. చిత్రమైన సమాదానం చెప్పుకొచ్చారు.

తన సొంతూరు నెల్లూరుకే స్మార్ట్ హోదా ఇప్పించుకోలేదని.. అలాంటి బెజవాడకు ఎలా ఇస్తామంటూ అదేదో గొప్ప విషయంలా చెప్పుకొచ్చారు. నిజానికి స్మార్ట్ నగరంగా ఎంపిక చేయటానికి విధివిధానాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పాలే తప్పించి.. ఇలాంటి మాటల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. పదవిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కువై అన్యాపదేశంగా కొన్ని వ్యాఖ్యలు చేసేయటం మామూలే. కానీ.. ఇలాంటి మాటలు దీర్ఘకాలం వెంటాడి వేధిస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

స్మార్ట్ నగరాల ఎంపికకు.. పన్నువసూళ్లను ప్రాతిపదికగా తీసుకున్నట్లుగా చెబుతారు. స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన నగరాలకు పన్ను వడ్డింపు భారీగా ఉంటుందన్న వాదన ఉంది. అయితే.. అదేమీ ప్రస్తావించకుండా సొంతూరినే స్మార్ట్ సిటీగా చేయటం లేదు తెలుసా అన్నట్లుగా మాట్లాడటం ద్వారా వెంకయ్య ఏం ఆశిస్తున్నారో అర్థం కాదు.

అధికారంలో ఉన్నప్పుడు సొంతూరికి చేయలేని పెద్దమనిషి.. ఎంత పెద్దవాడు అయితే ఏం లాభం. సొంతూరిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయకపోవటాన్ని గొప్పగా చెబుతున్న వెంకయ్య.. గతంలో బెజవాడను స్మార్ట్ సిటీగా చేస్తామని మాట ఎందుకు ఇచ్చినట్లు? నేతల మాటలు నీటి మూటలన్న మాటను నిజం చేసేలా వెంకయ్య మాటలు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News