రెచ్చగొట్టి.. రచ్చ చేసి.. వెళ్లిపోదామనా వెంకటరెడ్డి..?

Update: 2022-08-13 11:30 GMT
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోఉంటారా? ఉండరా? అనేది పెద్ద సందిగ్ధంగా మారింది. తమ్ముడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనేమో.. అన్నదమ్ముల కలిసే ఉంటాం.. అని అంటున్నారు. వెంకటరెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ ను వీడి వెళ్లబోనని చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై వీర విధేయత చూపుతూనే.. తెలంగాణ నాయకత్వంపై విరుచుకుపడుతున్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక ఉన్నప్పటికీ.. జోక్యం చేసుకోవడం లేదు.

ఒకవైపు షాను కలుస్తూ..

ఇటీవల వరకు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అదే సందర్భంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ను కలిశారు. అంతకుముందే రాజగోపాల్ రెడ్డి.. షాతో భేటీ అయ్యారు. తమ్ముడు ఎలాగూ పార్టీ మారాడు కాబట్టి ఆయన బీజేపీ పెద్దలను కలవడం విషయం లేదు. కానీ, వెంకటరెడ్డి బీజేపీ నాయకులతో భేటీ కావడం, అది కూడా రాజకీయ ఊహాగానాలు సాగుతున్న సమయంలో సమావేశం కావడం చర్చనీయాంశమే. అయితే, ఎంత చేసినప్పటికీ తాను కాంగ్రెస్ ను వీడననే వెంకటరెడ్డి చెబుతున్నారు. ఈలోగా టీపీసీసీ ఆధ్వర్యంలో చండూరులో నిర్వహించిన సభలో ఓ నాయకుడు కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మారాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కోసం కోమటిరెడ్డి సోదరులు చేసిన శ్రమను పరిగణిస్తే.. ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిందే. అసలే టీపీసీసీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న వెంకటరెడ్డి.. ఆ నాయకుడి మాటలను పట్టుకుని క్షమాపణకు పట్టుబట్టారు. నాటి సభకు అధ్యక్షత వహించింది రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన శనివారం వెంకటరెడ్డిని హుందాగా బేషరతుగా క్షమాపణ కోరారు. ఓ వీడియోను విడుదల చేశారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్‌ క్షమాపణ తెలియజేశారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. వివాదం ఇంతటితో సమసిపోయిందని అనుకుంటే.. వెంకటరెడ్డి మళ్లీ మెలికపెట్టారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాకే రేవంత్‌ క్షమాపణపై ఆలోచిస్తాను’’ అని వెంకటరెడ్డి తెలిపారు.

పిలిచినా రాకుండా.. పిలవలేదంటూ

శుక్రవారం పీసీసీ తీరుపై వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడట్లేదని.. దాని గురించి తనకేం తెలియదని పేర్కొన్నారు. చండూరు సభలో ఓ పిల్లాడితో తనను తిట్టించారని.. అలా అవమానించేలా మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు.

శనివారం కాంగ్రెస్‌ పాదయాత్రకు ఎవరూ పిలవలేదని.. ఇలా తనను అవమానించేలా మాట్లాడిన తర్వాత ఎలా వెళ్తానని కోమటిరెడ్డి ప్రశ్నించారు. అయితే, చండూరు సభకు ఇతర కారణాలు చూపి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో సభ జరుగుతున్నా పార్లమెంటు సమావేశాలు ఉన్నట్లు చెప్పారు. దీనివెనుక ఉద్దేశం మాత్రం వేరే అన్నట్లు స్పష్టమైంది. చండూరు సభలో పాల్గొంటే తమ్ముడిపై విమర్శలు చేయాల్సి వస్తుందనే వెంకటరెడ్డి గైర్హాజరయినట్లు విశ్లేషకులు భావించారు.

వివాదం ముగించొచ్చుగా..?

వాస్తవానికి అద్దంకి దయాకర్ తరఫున రేవంత్ క్షమాపణతో విషయం ముగిసిపోయిందని అనుకుంటే.. వెంకటరెడ్డి మాత్రం ఇంకా పట్టు మీదనే ఉన్నారు. దయాకర్ వంటి వెనుకబడిన వర్గాల నేతపై చర్యకు పట్టుబట్టడం వెంకటరెడ్డి స్థాయికి తగని వ్యవహారం. దీన్నిబట్టి పార్టీలో మరింత చర్చనీయాంశం చేసి.. తనకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపిస్తూ.. ఆయన కాంగ్రెస్ ను వీడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సైతం ఏడాది పాటు తాను రేవంత్ నాయకత్వాన్ని భరించానని ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మరోవైపు వెంకటరెడ్డి పార్టీ మార్పు ఖాయమని.. ఆయన బీజేపీ పెద్దలతో ఇప్పటికే దీనిపై చర్చించారనే ఊహాగానాలు చెలరేగాయి. ప్రస్తుతం ఆయన వైఖరి చూస్తే ఇదే నిజమని భావించాల్సి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News