సెల్‌ ఫోన్ క‌న్నా త‌క్కువ రేటుకే వెంటిలేట‌ర్‌

Update: 2020-04-09 12:50 GMT
ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వణికిస్తోంది. ఈ వైర‌స్ బారిన బాధ‌ప‌డుతున్న వారికి వైద్యం అందించ‌డం క‌ష్టంగా మారింది. ప్ర‌పంచ దేశాల్లో ఆ బాధితుల‌కు వైద్యం అందించ‌డానికి వైద్య ప‌రిక‌రాల కొర‌త తీవ్రంగా ఉంది. ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త‌దేశంలోనూ ఆ ప‌రిస్థి ఉంది. భార‌త‌దేశంలో ముందే వైద్యారోగ్య శాఖ‌కు త‌క్కువ సంఖ్య‌లో బ‌డ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఉన్న వాటిలోనే స‌ర్దుబాటు చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు దాని ప్ర‌భావం తెలుస్తోంది. ఉన్న అర‌కొర వైద్య సేవ‌లు - ప‌రికరాల‌తో వైద్యం అందిస్తున్న ప‌రిస్థితి. ఈ వైర‌స్ బారిన ప‌డిన వారికి అందిస్తున్న చికిత్సలో వెంటిలేటర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. అయితే వాటి తీవ్ర కొరత మరింత ఆందోళన రేపుతోంది. ఈ సమయంలో సెల్‌ ఫోన్ క‌న్నా అతితక్కువ ధ‌ర‌కే వెంటిలేట‌ర్లు తయారు చేస్తామని ఒక స్టార్టప్ సంస్థ చెబుతోంది. దీంతోపాటు ప్ర‌పంచ దేశాల్లో ఉన్న డిమాండ్‌ ను తీర్చే సామర్థ్యం త‌మ‌కు ఉంద‌ని ప్ర‌క‌టించింది.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన స్టార్టప్ జేకే దజ్తా సిస్టమ్స్ అతి త‌క్కువ ఖ‌ర్చుతో వెంటిలేట‌ర్‌ ను అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ఓపెన్ సోర్స్ వెంటిలేటర్ ప్రాజెక్ట్ ఆధారంగా, రీ-ఇంజనీరింగ్ డిజైన్‌ తో తాము ఆ వెంటిలేటర్‌ ను రూపొందించినట్లు జేకే దజ్తా సిస్టమ్స్ సంస్థ ప్ర‌క‌టించింది. మార్చి 22వ తేదీన మొద‌లుపెట్టి నాలుగు రోజుల్లోనే ఒక నమూనా వెంటిలేట‌ర్‌ ను రూపొందించిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆ వెంటిలేట‌ర్ కోయంబ‌త్తూరులోని ఈఎస్ ఐ ఆస్ప‌త్రి అనుమతి తో పాజిటివ్ ప్రెజర్ బ్రీతింగ్ వెంటిలేటర్ (ఐపీపీవీ) పరీక్షకు సిద్ధంగా ఉందని పేర్కొంది. అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లతో - కొత్తగా రీడిజైన్ చేసిన వెంటిలేటర్ల నమూనాను కేవలం రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. త్వరలోనే ఆ వెంటిలేట‌ర్‌ ను ప్ర‌యోగానికి పంప‌నున్నారంట‌.

రాతినం కళాశాల‌కు చెందిన బయో మెడికల్ కంప్యూటర్ సైన్స్ విభాగం సహకారంతో కార్తీక్ ఎస్ - గౌతమ్ - సంతకుమార్ బృందం ఈ వెంటిలేటర్ రూపకర్తలు. టైడల్ వాల్యూమ్, -నిమిషంలో తీసుకునే శ్వాస రేటు, తదితర అన్ని వివరాలను పర్యవేక్షిస్తూ ఈ వెంటిలేట‌ర్ నియంత్రిస్తుందని ఆ సంస్థ త‌న‌ నివేదిక‌లో తెలిపింది. రోగికి అందుతున్న ఆక్సిజన్ స్థాయిలను కూడా పర్యవేక్షించేలా దీన్ని మెరుగుపరిచారు. కొత్త డిజైన్ - ఆధునిక ఫీచర్లతో తయారుచేసిన ఈ వెంటిలేటర్ చాలామంది రోగులకు సహాయం చేస్తుందని ఆ సంస్థ ప్ర‌తినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల అనంతరం ప్రభుత్వ అనుమ‌తి పొంది అందుబాటులోకి తెస్తామ‌ని పేర్కొన్నారు.
Tags:    

Similar News