ఏందండి.. వేణుగోపాలాచారి గారు అప్డేట్ కారా?

Update: 2018-08-24 04:15 GMT
తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు భారీ ఎత్తున జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు తెలంగాణ‌లో ముంద‌స్తు ఆలోచ‌న‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయ‌ని చెప్పాలి.

ముంద‌స్తుపై గులాబీ పార్టీకి చెందిన నేత‌లు ఎవ‌రూ మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ని వేళ‌.. ఢిల్లీలోని తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి వేణుగోపాలాచారి మీడియాతో మాట్లాడారు. కేంద్రం ముంద‌స్తు పెడితే.. రాష్ట్రంలో ప‌రిస్థితి ఏమిట‌నే దానిపైనే చ‌ర్చ త‌ప్పించి.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న త‌మ ప్ర‌భుత్వానికి లేద‌ని చెప్పారు.

ఒక‌వేళ వేణుగోపాలాచారి మాటే నిజ‌మ‌ని అనుకుందాం.. త‌మ‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారాన్ని ఒక్క గంట కూడా త‌గ్గించుకునే ఆలోచ‌న‌లో లేద‌న్న విష‌యాన్ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా అప్పుడెప్పుడో ప్ర‌క‌టించారు. మ‌రి.. ఆయ‌న అంత స్ప‌ష్టంగా వెల్ల‌డించిన త‌ర్వాత కూడా కేంద్రం ముంద‌స్తు గురించి మాట్లాడాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

కానీ.. వేణుగోపాలాచారి మాత్రం ముంద‌స్తు ముగ్గులోకి కేంద్రాన్ని తీసుకొస్తున్నారే కానీ రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేద‌న్న‌ట్లుగా మాట్లాడుతున్నారు. ఓప‌క్క త‌మ‌కు ముంద‌స్తు మీద ఆలోచ‌న లేదంటూనే.. తెలంగాణ‌లో ముందుగా ఎన్నిక‌లు జ‌రిగినా.. షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగినా టీఆర్ ఎస్సే అధికారంలోకి వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు.

మ‌రి.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను రాజీవ్ శ‌ర్మ ఎందుకు క‌లిశార‌న్న ప్ర‌శ్న‌కు స్పందించిన ఆయ‌న‌.. కేంద్ర స‌ర్వీసుల్లో చేసిన నేప‌థ్యంలో పాత సంబంధాల‌తో క‌లిసి ఉంటార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌వేళ అదే నిజ‌మ‌నుకుంటే.. ముంద‌స్తు మీద ఎలాంటి ఆలోచ‌న‌లే లేకుంటే.. త‌మ భేటీతో అలాంటి అవ‌కాశం క‌లుగుతుంద‌న్న విష‌యం మీద అలెర్ట్ గా ఉండి.. ఈ స‌మావేశాన్ని అన‌ధికారికంగా నిర్వ‌హించొచ్చు. కానీ.. అలాంటిదేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి. అయినా.. వేణుగోపాలాచారిజీ.. మీరు ఢిల్లీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలోని అప్డేట్స్ ను ఫాలో అవుతున్న‌ట్లు లేదు?  ఇంత‌కీ.. ముంద‌స్తు మీద ఇలా మాట్లాడేస్తున్నారు అధినేత ప‌ర్మిష‌న్ తీసుకున్నారా?  బాసుతో చ‌ర్చించ‌కుండా ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యం తెలుసుగా?
Tags:    

Similar News