అయోధ్య రామమందిరానికి డెడ్ లైన్

Update: 2016-05-11 10:29 GMT
అయోధ్యలోని రామమందిర నిర్మాణంపై ఎంతోకాలంగా వివాదం ఉన్న సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు, బీజేపీ ఈ విషయంలో ఎన్నోమార్లు దూకుడు చూపించాయి. దీనిపై కోర్టులో కేసులూ ఉన్నాయి. రెండేళ్ల కిందట కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అయోధ్యలోని రామ మందిర నిర్మాణం అంశం మరోసారి ఊపందుకుంది. అయితే.. కేంద్రం దీనిపై పెద్దగా దూకుడు చూపించకుండా కాస్త సంయమనంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఈ తాత్సారాన్ని బీజీపీ అనుబంధ విశ్వ హిందూ పరిషత్ సహించలేకపోతోందట. అందుకు డెడ్ లైన్ పెట్టుకుంది. ఎట్టిపరిస్థితిలోనూ 2016 ముగిసేలోగా రామమందిర నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించింది.

 అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి డిసెంబర్‌ 31 తుది గడువుగా వీహెచ్ పీ ప్రకటించడం ఇప్పుడు ఒక్కసారిగా దేశంలో రాజకీయ వేడి మొదలైంది.  ఉజ్జయినిలో జరుగుతున్న మహాకుంభ్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా అక్కడకు చేరిన సాధువులను ఉద్దేశించి విహెచ్‌ పి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డిసెంబర్‌ 31నాటికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆరంభమవుతుందని ప్రకటించారు. తాము సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా మౌనం పాటించామని, డిసెంబర్‌ తరువాత వేచి ఉండేది ప్రసక్తే లేదని చెప్పారు.

కాగా సుప్రీంకోర్టులో రామమందిర వ్యాజ్యం పెండింగులో ఉన్న సమయంలో వీహెచ్ పీ చేసిన ప్రకటన కేంద్రాన్ని ఇరుకున పెట్టినట్లయింది. కేంద్ర ప్రభుత్వం వెనుక ఉండి వీహెచ్ పీతో ఈ ప్రకటన చేయించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివాదాస్పద అంశం కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి దుందుడుకు ప్రకటన చేయడం కోర్టు ధిక్కరణే అవుతుందని అంటున్నారు.
Tags:    

Similar News