హిందూ సంప్రదాయం పట్ల విశ్వాసం ఉన్న వారు మిగతా పండుగల కంటే దీపావళిని ఎంత ప్రత్యేకంగా, అట్టహాసంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దివాళీ రోజు కాల్చే టపాసుల వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుందని కొందరు కోర్టుకు వెళ్లడం వంటివి మరోవైపు ఉండనే ఉన్నాయి. ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా తాజాగా ఓ ప్రత్యేకతను భారతదేశం సంతరించుకుంది. ఇటాలియన్ అస్ట్రోనాట్ ఒకరు తీసిన ఓ ఫొటో వైరల్ అయింది.
పౌలో నెస్పోలీ అనే 60 ఏళ్ల అస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి దీపావళి రోజు ఓ ఫొటో తీశారు. `దీపావళి...హిందువుల దీపపు వెలుగుల పండుగ ఈ రోజు ప్రారంభం అయింది. ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు`` అని ట్వీట్ చేశారు. ట్విట్టర్ యూజర్లు ఈ ఫొటోకు పెద్ద ఎత్తున స్పందించారు. `దీపావళి పండుగ సంబురాన్ని నిజమైన చిత్రంతో కళ్లకు కట్టినట్లు చూపించారు`` అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఫొటోలో ఉన్న కాషాయరంగు గీత భారత్-పాకిస్తాన్ ల మధ్య ఉన్న సరిహద్దు రేఖ అని పేర్కొన్నారు. కొందరు దీనితో విబేధించారు. అయితే ఈ చర్చోపచర్చలు ఎలా ఉన్నా...వైరల్ అయిన ఈ ఫొటోలకు 6000 లైకులు - 3500 రీట్వీట్లు రావడం విశేషం.