విజయమంటే కేసీఆర్ దే

Update: 2016-01-04 11:13 GMT
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయాల్లో విజయం అంటే కేసీఆర్ దే. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా ఆయన పార్టీ పెట్టాడు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించిన చంద్రబాబు నాయుడును ఏకంగా తన రాష్ట్రం నుంచే బయటకు పంపాడు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించిన పార్టీని తన రాష్ట్రంలో లేకుండా చేయడానికి పావులు కదుపుతున్నాడు. ఇప్పుడు చివరిగా తనకు మంత్రి పదవిని నిరాకరించడానికి కారణమైన వ్యక్తినే తన పార్టీలో చేర్చుకున్నాడు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో కేసీఆర్ కు మంత్రి పదవి రాకపోవడానికి కారణం అప్పట్లో టీడీపీ నాయకుడిగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టరు విజయ రామారావు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. దాంతో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి విజయరామారావును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆయన పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతాయి. దాంతో అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ కు మంత్రి పదవిని నిరాకరించిన చంద్రబాబు.. దానిని విజయరామారావుకు ఇచ్చారు. కేసీఆర్ కు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. దాంతో ఆగ్రహించిన కేసీఆర్.. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ అంటూ పార్టీ పెట్టారు. దాదాపు 12 ఏళ్లపాటు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారంలోకి కూడా వచ్చారు.

12 ఏళ్ల కిందట తనకు మంత్రి పదవి రాకుండా ఉండడానికి ఎవరు కారణమో ఆ వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో.. మంత్రి పదవి ఇచ్చే హోదాలో ఆయన తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఇంతకు మించిన విజయాన్ని ఊహించలేము. ఇప్పుడు విజయరామారావుకు మంత్రి పదవిని కూడా ఇస్తే.. చంద్రబాబుపై కేసీఆర్ సాధించిన విజయాన్ని మాటల్లో కొలవలేము.
Tags:    

Similar News