విజ‌య‌సాయిరెడ్డి ఎఫెక్ట్‌..అమిత్‌షా వ‌ద్ద బాబు బుక్క‌యిన‌ట్లే

Update: 2020-01-11 17:41 GMT
ఢిల్లీ వేదిక‌గా ఏపీ మాజీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల‌ను వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ఏకంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్ద‌ల వ‌ద్దే బాబు చ‌క్రం తిప్పే రాజ‌కీయాల‌కు బ్రేక్ వేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ గా తెలుగేతర అధికారిని నియమించాలని కోరుతూ కేంద్రానికి రాసిన లేఖపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. విజ‌య‌సాయిరెడ్డి ఫిర్యాదు చేసిన‌ అంశంపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఆ లేఖను కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్‌ డైరెక్టర్ నియామకం తరచుగా  రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసం జరుగుతోందని పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌ 30న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - హోం మంత్రి అమిత్‌ షా - సీబీఐ డైరెక్టర్‌ కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తెలుగేతర అధికారిని జేడీగా నియమించాలని ఆయన కోరారు. తెలుగు అధికారిని జేడీగా నియమిస్తున్నందు వలన జరుగుతున్న అనర్ధాలను, అక్రమాలను ఆయన ఆ లేఖలో వివరించారు. తెలుగు అధికారులను జాయింట్‌ డైరెక్టర్లుగా నియమించడం వలన వారు స్థానిక రాజకీయ - సామాజిక పరిణామాలకు ప్రభావితులవుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడైన సీబీఐ జాయింట్‌ డెరెక్టర్‌ను ప్రలోభాలతో లోబరచుకుని వారిని తన రాజకీయ ప్రత్యర్ధులపైకి ఏ విధంగా ఉసిగొల్పుతారో గతంలో జరిగిన ఉదంతాలను విజయసాయిరెడ్డి ఆ లేఖలో వివరించారు. `గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ - చంద్రబాబునాయుడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారు.` అని పేర్కొన్నారు.

తాజాగా చంద్ర‌బాబు పాల‌న‌పై సైతం విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ``గడచిన అయిదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి కార్యకలాపాల నిగ్గు తేల్చాలంటే తెలుగేతర సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ గా తెలుగేతర అధికారి నియామకం జరిగితేనే సాధ్యపడుతుంది` అని ఆయన వివరించారు. ``ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మీరు స్పందించండి`` అని కోరారు. విజయసాయిరెడ్డి లేఖకు సమాధానంగా ఈనెల 10న హోం మంత్రి అమిత్‌ షా తిరిగి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి లేఖలో ప్రస్తావించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ప్రధాన మంత్రి నేతృత్వంలో పనిచేసే సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు ఆ లేఖను పంపినట్లు అమిత్ షా తెలిపారు.



Tags:    

Similar News