మాలోకం..మాతృభాష..లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు

Update: 2020-04-18 12:10 GMT
లాక్ డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత - టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయన కుమారుడు - ఎమ్మెల్సీ లోకేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇంట్లో ఉంటున్నారు. ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో దాక్కున్న వీరిపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో బాబు గారు పక్కరాష్ట్రంలో ఉండడం ఏందని నిలదీస్తున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వీరిని టార్గెట్ చేశారు. లోకేష్ బాబును చెడుగుడు ఆడేశారు. లోకేష్ తాజాగా హైదరాబాద్ లో రోడ్లపై కొడుకుతో కలిసి సైకిల్ పై తిరుగుతున్న వీడియోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి.. లోకేష్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ఇంట్లో ఉండకుండా ముఖానికి మాస్క్ లేకుండా కొడుకుతో కలిసి బయటకు వచ్చిన లోకేష్ ను ఎండగడుతూ  ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్‌ డౌన్‌ ను పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌ కు  స్కేట్‌ బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్!’’ అంటూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చాడు. లోకేష్ తీరును తూర్పారపట్టారు.

ఏపీలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న లోకేష్.. తాజాగా స్కేటింగ్ చేస్తున్న కొడుకు దేవాన్ష్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ సూచనలు చేయడాన్ని ట్వీట్ లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్  ‘మాతృభాషలో’ చెబుతున్నారంటూ  సెటైర్ వేశారు.
Tags:    

Similar News