మద్యనిషేధంపై వైసీపీ థింక్ ట్యాంక్ ఎనాల్సిస్..!

Update: 2016-11-03 10:52 GMT
మద్యం... తాగేవాళ్లు దాన్ని అమృతంలా చూస్తే, తాగించే ప్రభుత్వాలు దాన్ని ఖజానాపై లక్ష్మీ కటాక్షంలా భావిస్తాయి. అందుకే తాగినోళ్లకు తాగినంత అంటూ మద్యం వ్యాపారాన్ని తెగ ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వమైతే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో మద్య నిషేధం కోసం విపక్షాలు ఎంతగా డిమాండు చేస్తున్నా  ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే... మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయమేమీ తగ్గిపోదని.. అక్కడ కోల్పోయిన ఆదాయం మిగతా రంగాల్లో పెరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశ్లేషించారు.
    
మద్య నిషేధం వల్ల ఆదాయం తగ్గిపోయి అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని విజయసాయి వెల్లడించారు. మద్యపాన నిషేధం వల్ల అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని ఏషియన్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన రిపోర్టు కూడా స్పష్టం చేసిందని చెప్పారు. అదెలాగో ఆయన వివరించారు. ఒక ఇంటి పెద్ద రోజుకు 300 రూపాయలు సంపాదిస్తుంటే అందులో 150 రూపాయలు మద్యానికి ఖర్చు చేస్తున్నారని వివరించారు. అదే 150 రూపాయలతో ఇతర వస్తువులు కొంటే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. అభివృద్ధి కూడా రెట్టింపు అవుతుందన్నారు. అంతేకాకుండా మనుషుల ఆరోగ్యం పాడవకుండా రాష్ట్రంలోని కుటుంబాన్ని సుభిక్షంగా ఉంటాయన్నారు. మద్య నిషేధం వల్ల ప్రభుత్వాలు - ప్రజలు వైద్యానికి పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుందని చెప్పారు. మద్యానికి ఖర్చు చేయడం మానితే అది వారికి ఎంతో ఆదా కావడమే కాకుండా ఓవరాల్ గా సంపద సృష్టించినట్లవుతుందని విశ్లేషించారు.
    
ఎన్టీఆర్ మద్యనిషేధం విధించగా.. ఆదాయం తగ్గిపోతుందని ప్రచారం చేసి తిరిగి మద్యాన్ని తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. కాబట్టి మద్య నిషేధం వద్ద అభివృద్ధికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని… కాబట్టి ప్రతి మహిళా మద్యనిషేధం కోసం పోరాటం చేయాలన్నారు. ఇందుకు వైసీపీ కూడా మద్దతుగా ఉంటుందని ఆయన చెప్పారు. మరి ఎంపీగారి మాటలు చంద్రబాబు చెవికి ఎంతవరకు ఎక్కుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News