బాబు...విజ‌య‌సాయి చేసిన త‌ప్పేంటో చెప్పు

Update: 2018-03-23 19:00 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పీఎంఓలో తిరుగుతున్నార‌ని, ఇదేం ప‌ద్ద‌త‌ని ఆయ‌న మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల విరుచుకుప‌డ్డారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎంపీ అని, ఆయన పీఎంవోలో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. ఎవరితో లాబీయింగ్‌ లు చేయాల్సిన గతి బీజేపీకి పట్టలేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. బీజేపీతో పొత్తు తెంచుకున్నాక చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు.

కుట్ర అనే పదాన్ని ఇటీవల టీడీపీ నేతలు ఎక్కువగా వాడుతున్నారని అయితే కుట్ర‌లు ఎవ‌రు చేస్తారో అంద‌రికీ తెలిసిందేన‌ని రాంబొట్ల‌ అన్నారు. బీజేపీ పవన్‌ను ఆడిస్తోందని, జగన్‌తో కుమ్మక్కయిందనీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. బీజేపీ తిడతారని అనుకుని పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతల జనాన్ని తరించారని, అయితే అక్కడ సీన్ రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ గరుడ, ద్రవిడ అంతా అబద్ధమని, అదంతా ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని హీరో శివాజీ ఆరోపణలను కొట్టి పారేశారు. కారెం శివాజీ లాగా ఈ శివాజీ కూడా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికి కూడా తిరస్కరించలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఆ రాష్ట్రాలకు కేవలం ప్రత్యేకంగా నిధులు మాత్రమే ఇచ్చారని, నీతి అయోగ్ ప్రతిపాదనలతోనే అలా ఇచ్చారని ఆయన వివరించారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులున్నారని, చంద్రబాబును కూడా అందులో ఉండాలని కోరితే తిరస్కరించారని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నామ‌ని అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో సీఎం చంద్ర‌బాబు కోరుకోలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఎపికి కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కర్ణాటకకు నిధులు ఎక్కువ ఇస్తున్నామనే మాటలో నిజం లేదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన ప్రశ్నించారు.
Tags:    

Similar News