ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో బాగంగా పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుందనే చెప్పాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని - ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా సరిపోతుందని మొన్నటిదాకా చెప్పిన అధికార టీడీపీ - వైసీపీ వ్యూహంతో తప్పనిసరి పరిస్థితుల్లో హోదా ఉద్యమ బరిలోకి దిగక తప్పని పరిస్థితి. వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని - రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపే కాకుండా ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని ప్రకటించిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హఠాత్తుగా తన వ్యూహాన్ని మార్చేశారు. ఫలితంగా వైసీపీకి సమాంతరంగా అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ రెండు తీర్మానాలను వాయిదా వేసేస్తూ సాగిన లోక్ సభ స్పీకర్... నేటి ఉదయం కూడా వాయిదా వేసేశారు. సభ సజావుగా లేదన్న ఒకే ఒక్క కారణం చెప్పిన సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో సభలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభలో ప్రధాని మోదీ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలను కలిసిన టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్ - వై. సుజనా చౌదరిలు కెమెరాల కంటికి అడ్డంగా బుక్కయ్యారన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో సభ వాయిదా పడగా... బయటకు వచ్చిన సీఎం రమేశ్... తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో వైసీపీ - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది. సాయిరెడ్డి తమ కేసులను మాఫీ చేయించుకునేందుకు మోదీ కాళ్లపై పడ్డారని - దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ కాళ్లపై పడిన సాయిరెడ్డి ఏపీ ప్రజల గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని - ఈ కారణంగా సాయంత్రంలోగా సాయిరెడ్డి ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మోదీ కాళ్లపై పడుతున్న సాయిరెడ్డి ఫొటోలను బయటపెడతానని కూడా సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియా ముందుకు వచ్చిన సాయిరెడ్డి... సీఎం రమేశ్ - సుజనా చౌదరి - చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాటు సారా అమ్ముకుని బతికిన సీఎం రమేశ్... లక్షలాది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రమేశ్... అడ్డంగా కాంట్రాక్టులను చేపట్టి - వాటి ధరలను పెంచేసుకుంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. అసలు ప్రధాని కాళ్లపై ఎవరు పడ్డారన్న విషయంపై చర్చించేందుకు తాను సిద్ధమని - అందుకు సీఎం రమేశ్ సిద్ధమా? అని కూడా సాయిరెడ్డి ప్రశ్నించారు. అంతటితో ఆగని సాయిరెడ్డి... రెండు - మూడు రోజుల్లో సీఎం రమేశ్ అక్రమాలను బయటపెడతానని ప్రకటించారు. నేటి రాజ్యసభ సమావేశాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమని - రాజ్యసభ ప్రొసీడింగ్స్ వీడియో ఫుటేజీలను బయటపెట్టాలని - వాటిపై రాజ్యసభ సెక్రటరీ జనరల్ సంతకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చకు తాను సిద్ధమేనని కూడా సాయిరెడ్డి ప్రకటించారు.
మొత్తంగా సీఎం రమేశ్ పై ఓ రేంజిలో ఫైరైపోయిన సాయిరెడ్డి... ఆ తర్వాత సుజనా చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను మోసం చేసిన సుజనా చౌదరి నాలుగేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. ఓ కేంద్రమంత్రిగా ఉన్న సుజనాపై కోర్టు నాన్ బెయిలబుల్ బెయిల్ విడుదలైన విషయాన్ని సాయిరెడ్డి ప్రస్తావించారు. ఓ వైపు సీఎం రమేశ్ - మరోవైపు సుజనా చౌదరి వంటి వారిని పార్టీలో కొనసాగిస్తున్న చంద్రబాబు అసలు సిసలు దొంగ అని, టీడీపీ తెలుగు దొంగల పార్టీ అని కూడా సాయిరెడ్డి ఆరోపించారు. ఏ ఒక్క బ్యాంకులో కూడా తనకు సింగిల్ రూపాయి అప్పు లేదని, అలాంటి తనను చంద్రబాబు విజయ్ మాల్యాతో పోల్చిన వైనంపై మండిపడిన సాయిరెడ్డి... ప్రపంచంలోనే గజ దొంగగా పేరున్న చార్లెస్ శోభరాజ్‌తో చంద్రబాబును పోలుస్తున్నానని సంచలన వ్యాఖ్య చేశారు. మొత్తంగా తొలుత టీడీపీ చేసిన వాదనను తిప్పికొట్టే క్రమంలో సాయిరెడ్డి చాలా డేరింగ్ స్టేట్ మెంట్లే ఇచ్చారని చెప్పాలి. వీటిపై టీడీపీ ఏమంటుందో చూడాలి.