మ‌రీ ఓవ‌ర్ అవుతున్నాయి బాబూ!!

Update: 2022-12-25 06:30 GMT
రాజ‌కీయంగా పుంజుకునేందుకు.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించాల్సిందే. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నించాల్సిం దే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు చెప్పే విష‌యాలు.. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారున‌మ్మేలా ఉండాలి. న‌మ్మాలి కూడా. ఎక్క‌డ తేడా వ‌చ్చినా.. అంతా బెడిసి కొడుతుంది. హాస్యాస్ప‌దం గా కూడా మారుతుంది. ఈ ప్ర‌యోగం విక‌టిస్తే.. ఇక‌, మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉంటుంది.

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త నాలుగైదు రోజుల్లో అటు తెలంగాణ‌లో ఖ‌మ్మం.. ఇటు ఏపీలో విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగాలు చేశారు. ఈ ప్ర‌సంగాల్లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. కొంత ఎబ్బెట్టుగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నేనే హైద‌రాబాద్ క‌ట్టాన‌ని.. సైబ‌రాబాద్ క‌ట్టాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇక‌, ఏపీలోనూ ఇదే ప‌రిస్థితిలో మాట్లాడారు. నేనే అన్నీ చేశాన‌ని.. ఇప్ప‌డున్న వైసీపీ ఏమీ చేయ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు వినేందుకు ఒకింత అతిశ‌యంగా ఉన్నాయ‌ని.. ఓవ‌ర్ అవుతున్నాయ‌ని.. టీడీపీలోనే చ‌ర్చ జ‌రుగుతుండ డం గ‌మ‌నార్హం.  

ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కి రాష్ట్రాభివృద్ధి ఏ మాత్రం పట్టదని చంద్రబాబు విమర్శించారు. ఆయనకు తెలిసిందల్లా రివర్స్ పరిపాలన సాగించడమేనని, విధ్వంసం చేయడం సులువేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో న‌డిపించ‌డం చాలా కష్టమని చంద్రబాబు అన్నారు. తాను 14 ఏళ్ల‌ పాటు రాష్ట్రాన్ని పరిపాలించా నని, ఎలా అభివృద్ధి పరచాలో తనకు బాగా తెలుసునని అన్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు.

కానీ, అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌ ప్రసంగంలో సెల్ ఫోన్ల గురించి ప్రస్తావించారు. సెల్ ఫోన్లు ఎవరి వల్ల వచ్చాయంటూ ప్రశ్నించారు. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని స్పష్టం చేశారు. సెల్ ఫోన్లు ఉండటం వల్ల ఏ పని అయినా ఇట్టే చిటికెలో పూర్తవుతోందని గుర్తు చేశారు. దేశంలో సెల్ ఫోన్ల విప్లవం తన వల్లే వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ షోకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, వారి వినియోగించే సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను వెలిగింపజేశారు.

అయితే.. నిజానికి సెల్ ఫోన్ చంద్ర‌బాబు వ‌ల్లే వ‌చ్చింద‌ని ఎక్క‌డా రికార్డులు లేవు. ఆయ‌న చేసి కృషికి సంబంధించిన  చ‌ర్చ కూడా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఇలా చెప్పేస‌రికి సొంత పార్టీ నేత‌ల్లోనే చ‌ర్చ‌సాగుతోంది. మ‌రీ ఇంత అవ‌స‌రం లేద‌నేది వారి టాక్‌. ఇలా చెబుతూ పోతే.. మొత్తానికే మోసం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News