విజయసాయి నోట బంగారం సెంటిమెంట్ మాట

Update: 2021-03-25 04:54 GMT
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వదులుకోవటానికి ఏపీ ఏ మాత్రం సిద్దంగా లేదు. అధికార.. విపక్షం ఎవరికి వారుగా తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంత తప్పన్న విషయాన్ని ఇప్పటికే పలువురు తమ వాదనల్లో వినిపించటం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మోడీ సర్కారు చేస్తున్నది ఎంత తప్పన్న విషయాన్నిగణాంకాలతో సహా వివరించటం.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్న విషయాన్ని తన వాదనతో నిరూపించారు.

ఆయన చేసిన ప్రసంగానికి పలువురు సభ్యులు బల్లలు చరచటమే కాదు.. అభినందనలు తెలిపారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.. వైజాగ్ ఉక్కును ప్రైవేటు పరం చేసే విషయాన్ని తప్పు పడుతున్న విజయసాయి తాజాగా రాజ్యసభలో తన వాదనను మరోసారి వినిపించారు. ఆంధ్రుల సుదీర్ఘ పోరాటంతో.. ఆత్మబలిదానాలతో అవతరించిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసే విషయాన్ని మరోసారి ఆలోచించాలని కోరారు.

ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన విజయసాయి.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఉద్యోగులు గడిచిన నలభై రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతిని ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 2002 నుంచి 2015 వరకు లాభాల్లో నడిచిందని.. ఆ తర్వాతే నష్టాల్లోకి వెళ్లిందన్నారు. నష్టాల్లోకి వెళ్లటానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయని చెప్పారు.

తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టిందని.. అందుకోసం పెద్ద ఎత్తున రుణాల్ని సేకరించిందని.. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్టీల్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఒడిదుడుకుల కారణంగా నష్టాల పాలైందన్నారు. కేవలం కొన్ని సంవత్సరాల నష్టాల్ని సాకుగా చూపిస్తూ స్టీల్ ఫ్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయించటం సబబు కాదన్నారు. అ సందర్భంగా విజయసాయి కేంద్ర ఆర్థిక మంత్రికి ఆసక్తికర సూచన చేశారు.

తెలుగింటి కోడలుగా ఉన్న నిర్మలా సీతారామన్.. తెలుగు వారికి ఆస్తి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ బంగారంతో సమానమని.. తెలుగింటి ఆడబడుచు తన బంగారాన్ని అమ్ముకోవాలని అనుకోదని.. ఇంట్లో చిన్నపాటి కష్టాలు ఉన్నాయని ఏ తెలుగించి ఆడపడుచు తాను కూడబెట్టుకున్న బంగారాన్ని తెగనమ్ముకోదన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు చారిత్రక చిహ్నమని.. దాన్ని అమ్మకానికి పెట్టి ఆంధ్రుల మనోభావాల్ని గాయపర్చొద్దని కోరారు. మరి.. విజయసాయి సెంటిమెంట్ మాట ఎంతవరకువర్కువుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News