అన్నీ తానై.. జగన్ కు ఆపద్భాందవుడై..

Update: 2019-07-01 05:52 GMT
ఆయన పేరులోనే విజయం ఉంది.. ఆయన సాన్నిహిత్యంలోనూ విజయం ఉంది.. అప్పటికే ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్న వైఎస్ ఆర్ సీపీ విజయబావుటా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించారు... కొరకరాని చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసి ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతున్నారు.. టీడీపీ నేతలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.. ఏపీ హక్కుల కోసం ఢిల్లీ వేదిక పోరాడుతున్నారు. వైసీపీ తెరవెనుక శక్తిగా నిలుస్తున్న విజయసాయిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ప్రస్థానం ఒకసారి చూద్దాం..

ఉమ్మడి ఏపీలో తన పాదయాత్రతో కాంగ్రెస్ ను  అధికారంలోకి  తీసుకొచ్చారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక కేసులు పెట్టినా బెదరకుండా.. కాంగ్రెస్ ను ఎదురించి బయటకు వచ్చిన జగన్ ఇన్నేళ్లలో పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. పడ్డ అవమానాలు చెప్పనలవి కావు.. ఎంతో మనో - గుండె నిబ్బరం ప్రదర్శించారు. వేరొకరు అయితే బ్లాక్ మెయిల్ చేసిన పార్టీకి సాగిలపడేవారు. కాడివదిలేశారు. కానీ జగన్ అన్నమాట కోసం నిలబడ్డారు.  తండ్రిలాగే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. నాడు వైఎస్ వెనుకుండి ‘ఆత్మ’లా కేవీపీ రాంచంద్రరావు వ్యవహరిస్తే నేడు జగన్ కు అన్నీ తానై వి. విజయసాయిరెడ్డి వ్యవహరించారు. జగన్ తోపాటు జైలుకెళ్లి కేసులను ఎదుర్కొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన చేయి వదలని నేతగా ఇప్పుడు అందరి చేత కీర్తిని అందుకుంటున్నారు.

*ఎవరీ విజయసాయిరెడ్డి?

వి. విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. చార్టెడ్ అకౌంట్స్ చదవడంతో మంచి వ్యాపార మెళకువలు తెలుసు.  అందుకే హైదరాబాద్- చెన్నై- బెంగళూరుల్లో సొంత వ్యాపార సంస్థలను ప్రారంభించారు. కొన్ని జాతీయ బ్యాంకులకు బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు. తరువాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు డైరెక్టర్ గా పనిచేశారు. జగన్ వ్యాపార వ్యవహారాలు చూసేవారు.  ఆ తర్వాత జగన్ పై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసినప్పుడు తెరపైకి వచ్చారు.  సాక్షి మీడియా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నడిపించారు. వైసీపీ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు.

*జగన్ కు అన్నీ తానై..

ఇక కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ జగన్ పై ఎన్నో కేసులతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. జగన్ తోపాటు ఆయన కంపెనీ వ్యవహారాలు చూసిన విజయసాయిరెడ్డిని కూడా జైలుకు పంపారు. జగన్ తోపాటు అన్ని రోజులు జైలు శిక్ష పడ్డా మొండి- గుండె ధైర్యంతో విజయసాయి జగన్ వెంట ఉండడం విశేషం. ఇటీవల  ప్రతిపక్ష టీడీపీ రాజకీయ నేత కూడా జగన్ కు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కష్టాల్లోనూ అండగా ఉన్నారని.. అలాంటి గొప్పతనం ఎవరికుంటుందని.. అలాంటి ఒక్కరుంటే ఏమైనా సాధించవచ్చని..జగన్ సాధించారని వ్యాఖ్యానించడం విశేషం.  కష్టాల్లోనూ, ఇప్పుడు జగన్- వైసీపీ అధికారంలోకి రావడంలో విజయసాయిరెడ్డి తెరవెనుక ఉండి కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు వైసీపీలో జగన్ తర్వాత అంతటి గౌరవం, మర్యాదలు విజయసాయిరెడ్డి అందుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.. జగన్-విజయసాయి కలిసి ఏపీ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ అవినీతిని వెలికితీస్తున్నారు. వీరిద్దరి జోడీ ఏపీ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేస్తుందని ఆశిద్ధాం..
Tags:    

Similar News