విజయసాయికి ఇంతకంటే ఘోర అవమానం ఇంకేం ఉంటుంది?

Update: 2022-12-08 02:30 GMT
వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరనరాన పెడసరం.. అంతకు మించి ఎటకారం.. కనీస గౌరవ మర్యాదలకు దూరం ఉంటూ ఎవరినైనా సరే తన నోటికి బలి కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించే తీరు కనిపిస్తూ ఉంటుంది. తన ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలిచే ఆయనకు..తాజాగా తగిలిన షాక్ అలాంటి ఇలాంటిది కాదంటున్నారు.

ఈ మధ్యన రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరు ఉండటం తెలిసిందే. తాజాగా ఆయన పేరును తొలిగించినట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా రాజ్యసభ వెబ్ సైట్ అప్డేట్ చేసిన జాబితాలో ఆయన పేరు కనిపించటం లేదు.

మొత్తం ఎనిమిది మంది పేర్లతో కొద్ది రోజుల క్రితం రాజ్యసభ ఒక జాబితాను విడుదల చేసింది. అందులో పెద్దల సభ ప్యానల్ వైస్ ఛైర్మన్లుగా విజయసాయి పేరు ఉంది. ఆయనతో పాటు మరో ఏడుగురు ఎంపికైనట్లుగా జాబితాలో పేర్కొన్నారు.

వైస్ ఛైర్మన్లుగా ఎంపికైన మిగిలిన ఏడుగురిని చూస్తే..
1. భువనేశ్వర్ కలితా
2. ఎల్. హనుమంతయ్య
3. తిరుచ్చి శివ
4. సుఖేందు శేఖర్ రాయ్
5. సస్మిత్ పాత్ర
6.  సరోజ్ పాండే
7. సురేంద్రసింగ్ నాగర్ లు ఉన్నారు. వీరితో పాటు విజయసాయి పేరు కూడా ఉంది. అయితే.. నిన్న (బుధవారం) మధ్యాహ్నం 2.43 గంటల వేళలో కొత్త లిస్టును పెట్టామని.. పాతదాన్ని రివైజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ నూతన ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. కొత్త జాబితా గురించి చెబుతూ.. అందులోని వారి పేర్లను వెల్లడించారు. అందరి పేర్లు వచ్చినా.. విజయసాయి రెడ్డి పేరు మాత్రం లేదు. దీంతో.. ఆయన ఏమైనా మర్చిపోయారా? అన్న సందేహంతో రివైజ్డ్ జాబితాను మరోసారి చెక్ చేశారు.

అనూహ్యంగా కొత్త జాబితాలో విజయసాయిరెడ్డి పేరు కనిపించలేదు. అంతేకాదు.. రాజ్యసభ సచివాలయం బీఏసీకి సభ్యులకు ఆహ్వానాన్ని ఈ నెల 5న నోటీసులు పంపారు. అందులో కూడా విజయసాయి రెడ్డి పేరు లేకపోవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తనను వైస్ ఛైర్మన్ ప్యానల్ లో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాల్ని కూడా తెలిపారు కూడా. ఇప్పుడేమో.. లిస్టులో నుంచి పేరు లేకపోవటం చూస్తే.. విజయసాయికి ఇదో పెద్ద షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News