హైదరాబాద్ లో చంద్రబాబు చేసే గలీజ్ పనులు అవేనట

Update: 2020-06-24 15:38 GMT
రాజకీయాల రంగు.. రుచి.. వాసన పూర్తిగా మారిపోయింది. దాదాపుగా పదహారేళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అప్పటివరకున్న రాజకీయాలకు సరికొత్త ‘కళ’ను తీసుకొచ్చారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే.. ప్రజాభిమానాన్ని పెద్ద ఎత్తున సొంతం చేసుకున్న అరుదైన అధినేతగా ఆయన్ను చెప్పాలి.తన మీద పడే విమర్శల జడివాడను లెక్క చేయకుండా దూకుడనే ఆయుధంతో దూసుకెళ్లిన వైనం తెలుగు ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

తెలుగు రాజకీయాల్ని కొత్త దశకు తీసుకెళ్లిన ఆయన స్ఫూర్తితో.. తర్వాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్నో. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా.. వారి సంగతి చూసే విషయంలో జగన్ తరహా తెలుగు ప్రజలకు కొత్తదనే చెప్పాలి.

చురకత్తుల్లాంటి విమర్శలతో.. వణికిపోయే నిర్ణయాలు తీసుకోవటంలో జగన్ తర్వాతే ఎవరైనా అన్న మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. అందుకు తగ్గట్లే జగన్ పరివారంలోని వారి మాటలు ఇదేతీరులో కనిపిస్తాయి. తమను విమర్శించే వారిని.. వేలెత్తి చూపించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించే జగన్ బ్యాచ్.. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా కడిగిపారేస్తుంటారు. ఎంత మాట అనటానికైనా వెనుకాడరు.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్నే తీసుకుందాం. స్టార్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్.. కామినేని శ్రీనివాస్.. సుజనా చౌదరిలు భేటీ అయ్యారంటూ విరుచుకుపడుతూనే.. మధ్యలో చంద్రబాబును సీన్లోకి తీసుకొచ్చారు.  హైదరాబాద్ లో చంద్రబాబు చేసే గలీజు పనులు ఏమిటో తెలుసా? అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గోతులు తవ్వటం.. చీకటి వ్యాపారాలు.. మ్యానిఫ్యులేషన్..వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో మునిగి తేలుతుంటారని విజయసాయి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ స్తాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి.. దళారి స్థాయికి పతనమయ్యాడని చెప్పారు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికి రాలేడన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి చంద్రబాబు మీద ట్వీట్ విమర్శల్లో కొత్త తరహాలో విరుచుకుపడటం మాత్రం విజయసాయిరెడ్డికే సాధ్యమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News