విజయసాయిరెడ్డి ట్వీట్ లో తేడా కనిపించడంలేదూ...?

Update: 2023-03-01 15:37 GMT
వైసీపీలో నంబర్ టూ గా వెలిగిన వారు వేణుంబాక విజయసాయిరెడ్డి. ఆయన సర్వం సహా అన్నట్లుగా పార్టీలో ఉండేవారు. ఆ మాటే శాసనం అన్నట్లుగా పార్టీలో నడిచింది. అయితే ఇదంతా గతం. వర్తమానంలో చూస్తే విజయసాయిరెడ్డి ట్వీట్లలో ప్రత్యర్ధుల మీద బాణాలు లేవు. ఫైర్ అంతకంటే లేదు. అసలు ఆయన ట్విట్టర్ కి ప్రత్యర్ధులు లేరంతే.

ఇంతలో ఎందుకిలా అన్నదే చర్చ. లేటెస్ట్ గా చూస్తే మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి లో  నాలుగవ విడత రైతు భరోసా కింద బటన్ నొక్కి పంపిణీ చేశారు. ఆర్భాటంగా ఈ కార్యక్రమం సాగింది. అయితే ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం ఆరు వేల రూపాయలను ఇస్తోంది. దానికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం 7,500 రూపాయలను కలిపి 13,500లను ఏటా రైతులకు ఇస్తోంది.

దీనికి వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పధకంగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ పధకం కింద నాలుగవ విడత నిధులు విడుదల చేస్తే అందులో పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను మాత్రమే ట్వీట్ చేసి ప్రధాని నరేంద్ర మోడీ చిత్తశుద్ధిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడడమే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

పీఎం కిసాన్ యోజన పధకం కింద ఏటా ఎనిమిది కోట్ల మంది రైతులు దేశమంతా లబ్దిపొందుతున్నారని విజయసాయిరెడ్డి ప్రశంసించడం విశేషం. వ్యవసాయరంగానికి ఇది గొప్ప సహాయకారిగా నిలుస్తోంది అని ఆయన అంటున్నారు ప్రధాని మానస పుత్రిక అయిన ఈ పధకాన్ని తాను అభినందిస్తున్నాను అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం వైసీపీలోనే నొసలు చిట్లించేలా ఉందని అంటున్నారు.

ఈ మొత్తం ట్వీట్ లో ఏపీలో జగన్ మానసపుత్రిక అయిన వైఎస్సార్ రైతు భరోసా గురించి లేకపోవడమే చర్చకు తావిస్తోంది. ఎందుకిలా అన్నదే గుసగుసలుగా ఉంది. విజయసాయిరెడ్డి ట్వీట్లలో ఇంత తేడా ఉండడం మీదనే మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే అది ఇపుడే వచ్చింది కాదని అంటున్నారు గత కొన్ని నెలలుగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ కి పదును తగ్గిందని అంటున్నారు.

ఆయన ఎందుకో ప్రత్యర్ధులను పప్పు నాయుడు నిప్పు నాయుడు అంటూ విమర్శించడం మానేశారు. ఒక వైపు చంద్రబాబు జగన్ని పట్టుకుని ఘాటు విమర్శలు చేస్తున్నా విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాత్రం బాబు మీద నిప్పులు కురిపించడంలేదు అంటున్నారు. అలాగే లోకేష్ నెల రోజులుగా చేస్తున్న పాదయాత్రలో జగన్ మీద అనుచిత కామెంట్స్ చేస్తున్నా ఎందుకో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ ట్విట్టర్ మూగనోమును పట్టిందని అంటున్నారు.

మరి దీని మీదనే ఇపుడు వైసీపీలో చర్చ  జరుగుతోంది. అసలు ఏమి జరుగుతోంది అన్నదే అందరి మాటగా ఉంది. ఇంకో వైపు చూస్తే విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలతో బాగా సన్నిహితంగా ఉంటున్నారని, ఆయన తరచూ కేంద్ర మంత్రులను కలసి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే వారితో క్లోజ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు.

తాజాగా విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ని జాతీయ రహదారి 16తో  అనుసంధానించే భోగాపురం వయా రుషికొండ భీమిలీ ఆరు వరసల రహదానిని విస్తరించాలని కోరారు. విజయసాయిరెడ్డి ఇపుడు అభివృద్ధి పనుల మీదనే మాట్లాడుతున్నారు. ఆయన ట్వీట్లు కూడా హుందాగా ఉంటున్నాయి. దాంతో ప్రత్యర్ధి పార్టీలు సైతం ఆయన వైఖరిని ఆసక్తింగా గమనిస్తున్నాయి. ఇంతకీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో కాక పుట్టించే ట్వీట్లు రాకపోవడంతో తో వైసీపీ ఫ్యాన్స్ అయితే నిరాశంలో ఉన్నారనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News