కేసీఆర్ ఫ్రంట్ గాలి తీసేసిన రాములమ్మ‌

Update: 2019-02-03 17:21 GMT
ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌ కతాలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్‌ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ ను అదుపులోకి తీసుకునేందుకు ఇవాళ సీబీఐ అధికారులు వచ్చారు. ఐతే.. పోలీసులే సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఇంటికి సీబీఐ అధికారులు రావడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్‌ అయ్యారు. బీజేపీ తమను వేధిస్తోందని మండిపడుతూ కోల్‌ కతాలోని మెట్రో ఛానల్‌ వద్ద ధర్నాకు దిగారు. ఈ ఎపిసోడ్‌ పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పందించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను టార్గెట్ చేస్తూ ఆమె ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ - రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారని...ఈ పరిస్ధితుల్లో మార్పు తెచ్చేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేసిన విజ‌య‌శాంతి  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విష‌యంలో కేంద్ర వైఖరి పట్ల కేసీఆర్ స్పందనేదని సూటిగా ప్ర‌శ్నించారు. కేసీఆర్ చేసిన ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను సమర్ధించిన మ‌మ‌త విష‌యంలో గత రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వనియోగానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. ``సీబీఐని కీలు బొమ్మగా వాడుకుంటూ ఫెడరల్ వ్యవస్ధను దెబ్బ తీస్తున్నారని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంత జరుగుతున్నా - ఫెడరల్ వ్యవస్ధను కాపాడాలని ఉద్యమిస్తున్న కేసీఆర్ గారు మమత బెనర్జీకి మద్దతుగా - కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎందుకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు? కేసీఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పరిధిలోకి ఈ అంశం రాదా? లేక కొన్ని విషయాలను చూసి - చూడనట్లు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్ అజెండాలో భాగమా? ఈ విషయాలపై కేసీఆర్ గారు క్లారిటీ ఇస్తే బాగుంటుంది.`` అంటూ సూటిగా నిల‌దీశారు.

ఇదిలాఉండ‌గా - ధర్నాకు దిగిన మమత మాట్లాడుతూ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ అద్యక్షుడు అమిత్ షాలపై మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ - ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి, పశ్చిమ బెంగాల్‌కు పంపించారన్నారని వెల్లడించారు.  పోలీసులపై చర్యలకు తెగబడటం దారుణమని తెలిపారు.  తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై దాడి అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ధర్నాకు దిగానన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ను ధర్నా ప్రదేశం నుంచే ప్రవేశపెడతానని చెప్పారు.

Tags:    

Similar News