చిన్న‌మ్మ‌కు జైల్ రూల్స్ వ‌ర్తించ‌వంతే!

Update: 2017-06-06 09:07 GMT
జైల్లో ఉన్నా రాజ‌భోగాలు అనుభ‌వించ‌టం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది.  ప్ర‌ముఖులు ఎవ‌రికైనా జైలుశిక్ష‌కు గురైతే.. కోర్టు ఆదేశాలు వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి జైలులోకి వెళ్లే వ‌ర‌కూ మీడియా నిద్ర పోద‌న్న విమ‌ర్శ ఒక‌టి ఉంది. మ‌హా అయితే.. జైల్లోకి వెళ్లిన త‌ర్వాతి రోజున‌.. మొద‌టిరోజు జైలు అనుభ‌వం ఎలా ఉంద‌న్న విష‌యానికి కాసింత ప్రాధాన్య‌త ఇచ్చి వ‌దిలేయ‌టం క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత‌.. అంతా మామూలే. ఏం జ‌రుగుతున్నా.. ఏమీ జ‌ర‌గ‌న‌ట్లుగా ఉండిపోవ‌టం ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లకు ఒక అల‌వాటుగా మారింద‌న్న ఆరోప‌ణ ఘాటుగా వినిపిస్తుంటాయి. దీనికి బ‌లం చేకూరే ఘ‌ట‌న ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది.

త‌మిళ‌నాడు చిన్న‌మ్మ శ‌శిక‌ళ ఉదంతంలోనూ ఇలాంటిదే చోటు చేసుకుంద‌ని చెప్పాలి. అక్ర‌మాస్తుల కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న ఆమె తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. జైలుశిక్ష నేప‌థ్యంలో జైలుకు వెళ్ల‌టం వ‌ర‌కూ భారీ ప్రాధాన్య‌త ఇచ్చిన మీడియా.. జైల్లోకి వెళ్లిన త‌ర్వాత కూడా ద‌ర్బారు నిర్వ‌హిస్తున్న తీరుపై పెద్ద‌గా వార్త‌లు ఇవ్వ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

జైలు రూల్స్ ప్ర‌కారం సాయంత్రం ఐదు గంట‌లు దాటితే సంద‌ర్శ‌కులు ఎవ‌రినీ అనుమ‌తించరు. కానీ.. చిన్న‌మ్మ విష‌యంలో మాత్రం అలాంటివేమీ లేవ‌ని చెబుతున్నారు. ఆమె ఎప్పుడు ఎవ‌రిని క‌ల‌వాలంటే వారిని క‌లిసేలా జైలు అధికారులు అనుమ‌తిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా దిన‌క‌ర‌న్ చిన్న‌మ్మ‌ను క‌లిసిన త‌ర్వాత‌.. సాయంత్రం ఏడు గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ముఖ సినీన‌టి.. రాజ‌కీయనేత విజ‌య‌శాంతి చిన్న‌మ్మ‌తో జైల్లో స‌మావేశం కావ‌టంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

సాయంత్రం ఐదు గంట‌ల త‌ర్వాత సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తించ‌ని నేప‌థ్యంలో.. చిన్న‌మ్మ‌తో విజ‌య‌శాంతి భేటీకి అధికారులు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చార‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు లేవ‌నెత్తుతున్నారు. నేర‌స్తురాలిగా ముద్ర‌ప‌డిన చిన్న‌మ్మ‌ను విజ‌య‌శాంతి జైలులో క‌ల‌వ‌టం ఒక ఎత్తు అయితే.. రూల్స్ కు భిన్నంగా ఆమె భేటీ ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేస్తాన‌ని చెప్పే విజ‌య‌శాంతి లాంటి వారు.. అన‌వ‌స‌ర వివాదాల్లోకి కూరుకుపోవ‌టం ఆమెకు అంత మంచిది కాద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News