తెలంగాణ సీఎం పీఠంపై ఆమె క‌న్నుప‌డింది

Update: 2017-08-14 06:56 GMT
టాలీవుడ్ ఒక‌నాటి టాప్ హీరోయిన్‌, ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్ప‌టికీ ఆ పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న‌ మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవ‌లి కాలంలో క్రియాశీలంగా ఎక్క‌డ క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌మిళ‌నాడులో చోటుచేసుకున్న ప‌రిణామాల్లో చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గానికి రాములమ్మ మ‌ద్ద‌తిచ్చారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌కు వెళ్లిన విజ‌య‌శాంతి చిన్న‌మ్మ‌ శశికళతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏ మంత‌నాలు జ‌రిగింద‌నేది చ‌ర్చకు రాలేదు. అంతకుముందుకు విజయశాంతి మెరీనాబీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరని లోటని అన్నారు. ఆ త‌ర్వాత కూడా ఆమె ఎక్క‌డా మీడియాతో ముచ్చ‌టించ‌లేదు. సుదీర్ఘ‌కాలం గ్యాప్ త‌ర్వాత తాజాగా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన విజ‌య‌శాంతి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

అనేక ఎత్తుప‌ల్లాలు ఎదుర్కొని సినీరంగంలో సూప‌ర్ స్టార్ ఇమేజ్‌ ను తాను సొంతం చేసుకున్నాన‌ని విజ‌య‌శాంతి చెప్పారు. అదే రీతిలో రాజ‌కీయాల్లో సైతం త‌న ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న‌ట్లు తెలిపారు. 19 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయ‌డం త‌న జీవితంలో కీల‌క ప‌రిణామ‌మ‌ని తెలిపారు. తెలంగాణ‌ సీఎం కావాల‌నే ల‌క్ష్యం ఉండ‌టంలో త‌ప్పేముంద‌ని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉంటే తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క పోస్టులో ఉండే దానిన‌ని అంగీక‌రించిన విజ‌య‌శాంతి....అయితే ప్రాంతీయ పార్టీలో ఎదుగుద‌ల ఉండ‌ద‌ని అన్నారు.

తెలంగాణా రాష్ర్టం కోసం 'తల్లి తెలంగాణ' పార్టీ పెట్టిన విజయశాంతిని ఒప్పించి టీఆర్ ఎస్ లో చేర్పించడమే కాకుండా...పార్టీని విలీనం చేయించడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. టీఆర్‌ ఎస్‌ లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కు విజయశాంతి అత్యంత సన్నిహితంగానే ఉన్నారు. పలు ఎన్నికల ప్రచారాల్లోనూ రాములమ్మ కీలక పాత్ర పోషించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు కొంత సినీ గ్లామర్‌ తోడయ్యింది. అయితే, కేసీఆర్ వ్యవహారశైలి వల్ల 2014 సాధారణ ఎన్నికలకు ముందు విజయశాంతి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఓటమి అనంత‌రం విజ‌య‌శాంతి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తెర‌మ‌రుగు అయ్యారు.  కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాల‌కు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు.
Tags:    

Similar News