ఉచితాలపై సుప్రీంలో విజయసాయి పిటిషన్.. వైసీపీ చెప్పిన అంశాలేమంటే?

Update: 2022-08-18 06:59 GMT
సంక్షేమ పథకాలు.. ఉచితాలు.. తాయిలాలతో పేదలు.. సామాన్యుల్ని ముంచెత్తుతున్న ప్రభుత్వాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఫ్రీబీస్ అన్నంతనే గుర్తుకు వచ్చే పార్టీగా ఏపీఅధికారపక్షం నిలుస్తుంది. ఈ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. సుప్రీంకోర్టులో ఉచిత పథకాలు.. సంక్షేమ పథకాలు ఏ మాత్రం సరికాదంటూ పిటిషన్ దాఖలు కావటం.. ఆ విచారణలో భాగంగా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించాలని కోరింది. ఇందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు అధికార పక్షం డీఎంకే.. ఢిల్లీ.. పంజాబ్ లో అధికార పార్టీగా వ్యవహరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాల్ని వెల్లడించాయి.

తాజాగా ఏపీ అధికారపార్టీ వైసీపీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. సంక్షేమ పథకాలకు.. తాయిలాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆ పార్టీతరఫున రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పిటిషన్ ను దాఖలు చేశారు.

ఉచిత పథకాలు. ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన హామీలన్నీ ఆర్థికపరమైనవి కావడం వల్ల వాటిని నియంత్రించాల్సి ఉందంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు తమ వాదనను వినిపించేందుకు వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులు బీజేపీకి చెందిన అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో ఉచిత పథకాల్నిసామాజిక పెట్టుబడిగా అభివర్ణించారు. తమ పిటిషన్ లో ఏపీలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందుపరిచారు. వాటి అవసరాల గురించి వివరించారు. ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయటానికి అవసరమైన చేయూతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

పేద ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయటం ప్రభుత్వాల బాధ్యతగా అభివర్ణించిన ఆయన.. ఆరోగ్య శ్రీ.. రైతు భరోసా.. అమ్మఒడి కార్యక్రమాలుప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునే వీలుందన్నారు. సామాన్య ప్రజలు సమాజంలో గౌరవ ప్రదంగా జీవించటానికి అవసరమైన సౌకర్యాల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వాటిని సామాజిక పెట్టుబడిగా భావించాలన్నారు. ఉచిత పథకాల్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని.. అలా చేయటం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుందన్నారు.

ఎన్నికలకు ఆరునెలల ముందో.. ఏడాది ముందో ఓటర్లను ఆకట్టుకోవటానికి అప్పటికిప్పుడు పథకాల్ని అమలు చేసే పాలకులు ఉన్నారని.. అలాంటి పార్టీల నేతలు ఇచ్చే హామీల్ని అడ్డుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పని చేస్తూ.. వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించటానికి రాజకీయ దృష్టితో చూడకూడదన్నారు. మిగిలిన పార్టీలు తమ అభిప్రాయాల్ని ఏమని చెబుతాయో చూడాలి.
Tags:    

Similar News