రోడ్డు పై నడవాలన్న డబ్బులు కట్టాలేమో!

Update: 2019-12-21 07:41 GMT
తెలంగాణ ప్రభుత్వం పై  కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి మరోసారి  తీవ్రస్థాయిలో  ఫైర్ అయ్యారు. మొన్న ఆర్టీసీ.. నిన్న పాల ధరలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కరెంట్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్‌ పై విమర్శలు గుప్పిస్తూ.. ఫేస్‌ బుక్‌ లో విజయశాంతి ప్రకటన విడుదల చేశారు.
 
‘‘అభివృద్ధి పేరుతో ఇంతకాలం గారడీ చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను కారణంగా చూపించి చార్జీలు పెంచారు. నిత్యావసర వస్తువుగా ఉన్న పాల ధరను కూడా పెంచారు. ఇవి చాలవని ఇప్పుడు కరెంటు చార్జీలను కూడా అమాంతంగా పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచి - వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితిలో సీఎం దొరగారు ఉన్నారు. ఓవైపు దుబారా ఖర్చులు చేస్తూ... మరోవైపు ఇష్టానుసారంగా అప్పులు చేస్తే, ఆ భారం సామాన్యుడి మీద పడుతుందని ప్రతిపక్షాలు పలుసార్లు హెచ్చరించినపుడు - వారిపై కేసులు పెడతానని కేసీఆర్ గారు బెదిరించారు. గతంలో టిఆర్ ఎస్ పాలకులు చేసిన పాపం ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందన్న విషయం అందరికీ బోధపడుతోంది. టీఆర్ ఎస్ ప్రభుత్వ వాలకాన్ని చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సామాన్యులు రోడ్డు మీదకు వచ్చి నడిచినా డబ్బులు వసూలు చేస్తే తప్ప - ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీన్నే కేసీఆర్ గారి పరిభాషలో బంగారు తెలంగాణ అంటారేమో?’’ అంటూ ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది.
Tags:    

Similar News