త‌న గురించి ఎవ‌రికీ తెలీని నిజాన్ని చెప్పిన రాహుల్‌

Update: 2017-10-27 05:36 GMT
అమూల్ బేబీ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చేసే వ్యంగ్యం గురించి అంద‌రికి తెలిసిందే. అయితే.. త‌న‌కు సంబంధించి ఎవ‌రికి తెలీని ఒక నిజాన్ని బ‌య‌ట‌పెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు కాంగ్రెస్ యువ‌రాజు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పీహెచ్ డీ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ లో మాట్లాడిన రాహుల్‌.. త‌న‌కు జ‌ప‌నీస్ క్రీడ అయిన అకిడో స్పోర్ట్స్ లో ప్రావీణ్యం ఉంద‌ని చెప్పారు. అంతేకాదు.. ఆ క్రీడ‌లో తాను బ్లాక్ బెల్ట్ సాధించిన విష‌యాన్ని చెప్పారు.

స్విమ్మింగ్ తో స‌హా ప‌లు క్రీడ‌ల్లో తాను పాల్గొన్న‌ట్లుగా చెప్పిన రాహుల్.. జ‌పాన్ మార్ష‌ల్ ఆర్ట్స్ లో భాగ‌మైన అకిడోలో బ్లాక్ బెల్ట్ సాధించాన‌ని.. ఈ క్రీడ గురించి చాలామందికి తెలీద‌ని.. ఆ క్రీడ‌ను అంద‌రూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న‌కు అకిడో క్రీడ‌లో ప్రావీణ్యం ఉన్నా బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని.. బ‌హిరంగంగా ఎప్పుడూ మాట్లాడ‌లేద‌న్నారు. కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న రాహుల్ కున్న ఈ ప్రావీణ్యం గురించి తెలిసిన ప‌లువురు ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇక‌.. ఈ కార్య‌క్ర‌మానికి బాక్సింగ్ క్రీడాకారుడు విజేంద‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ బ‌దులిచ్చారు. ఫార్టీప్ల‌స్ లోకి వ‌చ్చేసి చానాళ్లు అయినా ఇప్ప‌టికి పెళ్లి విషయాన్ని తేల్చ‌ని రాహుల్ ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ విజేంద‌ర్ ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులిచ్చిన రాహుల్.. ఎప్పుడు జ‌ర‌గాల‌ని ఉంటే అప్పుడే జ‌రుగుతుంద‌ని బ‌దులిచ్చారే త‌ప్పించి.. సూటిగా మాత్రం స్పందించ‌లేదు.
Tags:    

Similar News