అంతా చంద్రబాబే చేస్తున్నారట

Update: 2015-06-27 05:03 GMT
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల విభజన సమయంలో నెలకొన్న విబేధాలు, అపోహలు ఎవరికి వారు పరిపాలన కొనసాగించుకుంటున్న సమయంలో తొలగిపోతాయని భావించిన వారికి పలు సందర్భాల్లో నిరాశ తప్పడం లేదు. కొన్ని ఉద్దేశపూర్వక, అనేక సమాయానుసారం నిర్ణయాల వల్ల ఇరు రాష్ర్టాల మధ్య నిరంతరం ఏదో సమస్య రాజుకుంటూనే ఉంది. తాజాగా రెండు రాష్ర్టాల్లోనూ వేడెక్కిన వాతావరణ పరిస్థితి ఉంది. ఓటుకునోటు ద్వారా ఎమ్మెల్యేలను కొని తమ సర్కారును అప్రతిష్ట పాలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నించారని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. తమ ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశారని ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది.

పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ర్టాలకు ప్రాధాన్యం దక్కేలా హైదరాబాద్‌లో సెక్షన్‌-8ను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం, అక్కడి సీఎం చంద్రబాబు, ఏపీ రాజకీయ వేత్తలు డిమాండ్ చేస్తుండగా....ఆ అవసరమే లేదు. అలాంటి నిర్ణయం తీసుకుంటే ఊరుకోబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ వినోద్ కుమార్ కొత్త వాదన తెరమీదకు తీసుకువచ్చారు.

హైదరాబాద్ లో సెక్షన్‌-8 అమలు చేయాల్సిన అవసరం లేకుండా సీఎం కేసీఆర్‌ అన్నివర్గాలకు అనుకూలమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. అదే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ తెలియజేస్తున్నారని చెప్పారు. దీంతో ఏదైనా ఇబ్బందికరమైన అంశం ఉంటే వెంటనే సరిదిద్దుకునేందుకు అవకాశం దొరుకుతోందని అన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ ను అరుదుగా కలుస్తున్నారని వినోద్ అన్నారు. చంద్రబాబు తనను కలుసుకోవడంలేదని గవర్నర్‌ సైతం తనతో చెప్పినట్లు వినోద్ ప్రస్తావించారు. తను గవర్నర్ ను  విమానంలో కలుసుకున్నప్పుడు ఈ విషయం చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ వివరించారు.

మొత్తంగా గవర్నర్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం అవకపోవడం వల్లే సమస్యలన్నీ వచ్చిపడుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీ  చెప్పినట్లయింది.
Tags:    

Similar News