డేరా సామ్రాజ్యాన్ని ఇక ఏలేదెవ‌రు?

Update: 2017-08-27 06:39 GMT
వంద‌ల కోట్ల ఆస్తులున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. మూడున్న‌రేళ్లుగా మోడీ సంపాదించుకున్న పేరు ప్ర‌ఖ్యాతులు.. డేరా బాబా పుణ్య‌మా అని ఒక్క రోజులో నాశ‌నం అయిన ప‌రిస్థితి. బాబా మీద వ‌చ్చిన అత్యాచార ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని.. అత‌డ్ని దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు తీర్పును ఇచ్చిన నేప‌థ్యంలో రెచ్చిపోయిన అత‌డి ప‌రివారం పంచ‌కుల ప‌ట్ట‌ణాన్ని స‌ర్వ‌నాశ‌నం అయ్యేలా చేసింది.

క‌నిపించిన ప్ర‌తి ఆస్తికి నిప్పు పెట్టేసిన బాబా భ‌క్తుల్ని నిలువ‌రించ‌టంలో కేంద్రం ప్ర‌ద‌ర్శించిన ప్రేక్ష‌క‌పాత్ర‌ను హ‌ర్యానా.. పంజాబ్ హైకోర్టులు తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. మోడీ దేశానికి ప్ర‌ధానే కానీ బీజేపీకి కాదంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసేలా చేసింది.

రెచ్చిపోయిన డేరా బాబా భ‌క్తులు ర‌చ్చ‌ను ప‌క్క‌న పెడితే.. డేరా స‌చ్ఛా సౌధాకు ఇప్పుడు చీఫ్ ఎవ‌రు? అత‌డి సామ్రాజ్యాన్ని ఎవ‌రు ఏల‌నున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గుర్మీత్‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు డేరా చీఫ్ గా మారే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

డేరా ఛీప్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు 35 ఏళ్ల గురు బ్ర‌హ్మ‌చారి విపాస‌న అనే మ‌హిళ అయితే.. మ‌రొక‌రు డేరా సంస్థ‌కు నంబ‌ర్ దార్ (సంస్థ పెద్ద‌)గా ప‌ని చేస్తున్న 28 ఏళ్ల హ‌నీ ప్రీత్ అనే మ‌హిళ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఏడేళ్లుగా ఆమె  గుర్మిత్ కు అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెబుతున్నారు.  గుర్మిత్ తీసిన అన్ని సినిమాల్లోనూ హ‌నీ కీల‌క‌పాత్ర పోషించ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ ఇద్ద‌రిలో డేరా సామ్రాజ్యానికి కాబోయే చీఫ్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News