బీసీసీఐ నుంచి గంగూలీ ఔట్.. కోహ్లి ఫ్యాన్స్ సంబరం

Update: 2022-10-13 03:33 GMT
'క్రికెట్ అంటేనే అనూహ్య క్రీడ..'ఈ మాటన్నది ప్రఖ్యాత క్రికెటర్ సునీల్ గావస్కర్. నేటి హీరో.. రేపటి జీరో కావొచ్చనేది ఆయన ఉద్దేశం. ఇది వ్యక్తిత్వపరంగా కావొచ్చు.. లేదా ఆటలో వైఫల్యాల పరంగా కావొచ్చు. ఇప్పుడిదే విషయం సౌరభ్ గంగూలీకి ఆపాదిస్తూ విరాట్ కోహ్లి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా గంగూలీ మరోసారి ఎన్నిక కావడం లేదని తెలియడం విరాట్ ఫ్యాన్స్ కు పండుగగా మారింది. గంగూలీకి బీసీసీఐ సీనియర్లు అడ్డుపడడంతో అతడు రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగే వీల్లేకపోయింది. అధ్యక్షుడు సహా బోర్డు పదవులకు బుధవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో సౌరభ్ ప్రస్థానం ముగిసినట్లయింది. వచ్చే మంగళవారం అంటే ఈ నెల 18న బీసీసీఐ
ఎన్నికలు జరుగనున్నాయి. పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో.. అన్ని పదవులు ఏకగ్రీవం కానున్నాయి.

విరాట్ అభిమానులకెందుకు సంబరం?

ఈ ఏడాది మొదట్లో భారత క్రికెట్ లో కెప్టెన్సీ దుమారం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాలుగా స్థిరమైన నాయకత్వానికి అలవాటుపడ్డ భారత క్రికెట్లో ఇది.. ఒకప్పటి అనిశ్చిత వాతావరణాన్ని గుర్తుతెచ్చింది. అయితే, ఆ దుమారం తొందరగానే చల్లారింది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి వన్డే సారథిగా కొనసాగుతానని.. టి20 నాయకత్వాన్ని వదులుకుంటానని చెప్పడం.. ఇందుకు సౌరభ్ గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ ససేమిరా అనడం తెలిసిందే. ఒకవిధంగా విరాట్ ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించినంత పని చేశారు. దీంతో అతడు టెస్టు కెప్టెన్సీకీ రాంరాం చెప్పాడు.

ఈ విషయంలో కోహ్లి అభిమానులు గంగూలీపై పీకల వరకు కోపంతో ఉన్నారు. గంగూలీ మొండి వైఖరి కారణానే కోహ్లి కెప్టెన్సీ పోయిందనేది వారి ఆక్రోశం. అందుకనే.. ఇప్పుడు గంగూలీకి బీసీసీఐ పదవి రెండోసారి దక్కకపోవడంపై సంబరాలు జరుపుకొంటున్నారు. కోహ్లీ వందో టెస్టు సందర్భంగా కూడా సరిగ్గా గౌరవించలేదనేది వారి అభిప్రాయం. వీరిద్దరి మధ్య వివాదంతో పాటు రోహిత్ -కోహ్లి గొడవలపైనా చర్చ సాగింది. కొద్ది కాలానికి ఇది ముగిసినా గంగూలీపై విరాట్ వీరాభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. అందుకనే తాజా ఉదంతాన్ని ఎత్తిచూపుతూ కర్మ ఫలితాన్ని పొందుతున్నాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

బీసీసీఐలో సౌరభ్ ఉనికే లేకుండా

వాస్తవానికి సౌరభ్ గంగూలీ బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. కోహ్లి కూడా ఆ తరహానే. దీంతో ఎందులోనూ వెనక్కితగ్గని ఇద్దరి మధ్య పొసగడం కష్టమైంది. ఎప్పుడైతే బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ వచ్చాడో.. ఎప్పుడైతే రవిశాస్త్రి కోచ్ పదవీ కాలం అయిపోయిందో.. అప్పటినుంచే కోహ్లి హవా తగ్గడం మొదలైంది. దీనికితోడు అతడి ఫామ్ పడిపోవడం మరింత విమర్శలకు తావిచ్చింది.

ఈలోగా కెప్టెన్సీ వివాదం ముసురుకుంది. గంగూలీ వంటి స్థిర అభిప్రాయాలు ఉన్న అధ్యక్షుడి ముందు కోహ్లి మాట నెగ్గలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే బీసీసీఐలో గంగూలీకి అసలు చోటే లేకపోయింది. 2019లో అధ్యక్షుడు అయిన అతడు మరో దఫా కొనసాగడం ఖాయం అనుకున్నారు. కానీ, ఇప్పుడంతా తారుమారైంది.  బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ కథ ముగిసింది! మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తిప్పిన గంగూలీ నిష్ర్కమించక తప్పని పరిస్థితి వచ్చింది.

ఐపీఎల్ చైర్మన్ గిరీ వద్దన్న దాదా

కాగా, గంగూలీకి వేల కోట్ల రూపాయిల విలువైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చైర్మన్ షిప్ ఇవ్వజూపినా అతడు తిరస్కరించినట్లు సమాచారం. వాస్తవానికి ఐపీఎల్ చైర్మన్ గిరీ బలమైనదే. కానీ, బీసీసీఐ చీఫ్ గా చేసి.. అదే బీసీసీఐలోని ఓ భాగమైన లీగ్ కు చైర్మన్ కావడం తనకు తగదని సౌరభ్ భావించాడు. దీన్నిబట్టే గంగూలీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

ఐసీసీ పదవి దక్కడం కష్టమే..

'విధుల నిర్వహణలో విఫలమయ్యాడు'ఇదీ గంగూలీని బీసీసీఐ చీఫ్ కొనసాగించకపోవడానికి బోర్డు సీనియర్లు చెప్పిన కారణం. దీంతోనే అతడిని కొనసాగించడం కష్టమని స్పష్టమైంది. మరోవైపు ''ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ప్రతిపాదిస్తారో లేదో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా లేదు''అని బోర్డు వర్గాలు వివరించాయి. 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు, కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం ఖాయమైంది. ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా పోటీపడుతున్నాడు. ఇక ఐసీసీ ఛైర్మన్‌ పదవి గంగూలీకి ఎందుకు దూరమైందో చూస్తే.. బీసీసీఐ తరఫున ఐసీసీ వ్యవహారాలను జై షా చూస్తుండడమే కారణంగా స్పష్టమవుతోంది. వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాదే సమయమున్న నేపథ్యంలో ఐసీసీ
డైరెక్టర్ల బోర్డు సమావేశంలో భారత్‌కు బలమైన నాయకత్వం ఉండటం చాలా ముఖ్యం అంటూ గంగూలీకి బీసీసీఐ సీనియర్లు చెక్ పెట్టారు. దీంతో ఐసీసీలో భారత బోర్డు ప్రతినిధిగా జై షా ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News