ఎవ‌రీ చారుల‌త‌? ఎందుకింత హాట్ టాపిక్?

Update: 2019-07-03 05:09 GMT
ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో టీమిండియా సెమీస్ లో త‌న సీటును రిజ‌ర్వ్ చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ మీద గెలిచిన మ్యాచ్ తో సెమీస్ కు దూసుకెళ్లింది. ఇదంతా క్రికెట్ అప్డేట్ న్యూస్. ఇప్పుడీ విష‌యం కంటే కూడా క్రికెట్ అభిమానులు చారుల‌త ప‌టేల్ గురించి అదే ప‌నిగా మాట్లాడుకుంటున్నారు. ఇంత‌కీ.. ఈ చారుల‌త ప‌టేల్ ఎవ‌రు?  రాత్రికి రాత్రి క్రికెట్ క్రీడాభిమానుల‌కేకాదు.. కోహ్లీ.. రోహిత్ శ‌ర్మ లాంటి స్టార్ ప్లేయ‌ర్లు సైతం ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుతున్నారు. ఎందుకిలా? ఎందుకంత ఫేమ‌స్ అన్న విష‌యాల్లోకి వెళితే..

క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్న వేళ‌.. ఆట‌తో పాటు.. మ‌ధ్య మ‌ధ్య‌లో సంద‌డి చేసే ప్రేక్ష‌కుల్ని.. అభిమానుల్ని చూపిస్తుంటారు. త‌మ వైపు కెమెరా వ‌చ్చినంత‌నే ఒక్క‌సారిగా ఉత్సాహంగా సంద‌డి చేస్తారు. కెమేరా క‌న్ను తమ మీద ప‌డేందుకు స్టేడియంలో ఉన్న వారు ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా సాదాసీదాగా స్టేడియంలోకి వ‌చ్చారు చారుల‌త‌. కాక‌పోతే ఆమె వ‌య‌సు 87 సంవ‌త్స‌రాలు. న‌డ‌వ‌లేని ఆమెకు క్రికెట్ అంటే ప్రాణం. అందుకే మ‌న‌మ‌రాలి సాయంతో వీల్ ఛైర్ లోనే స్టేడియంకు వ‌చ్చారు.

అలా ఆమె ఎంట్రీని కెమేరా మెన్ గుర్తించారు. దీనికి తోడు ఈ బామ్మ బుగ్గ‌న త్రివ‌ర్ణ‌ప‌తాకం పెయింట్ వేసుకొని.. భార‌త్ ఆట‌గాళ్లు బాగా ఆడిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ బూర ఊదుతూ త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. మ్యాచ్ జ‌రిగినంత సేపు ఆమె సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్ గా మారారు. చేతులు చివ‌రి వ‌ర‌కు స్వెట్ట‌ర్ వేసుకొని.. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చిన ఆ వృద్ధురాలి ఉత్సాహం.. యూత్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది. దీంతో.. ఆమె అంద‌రిదృష్టిని ఆక‌ర్షించారు. ఏ మాత్రం అవ‌కాశం వ‌చ్చినా లైవ్ కెమేరా ఆమె వైపు తిర‌గ‌టంతో కాసేప‌టికే ఆమె ఎవ‌ర‌న్న విష‌యంపై ఉత్సుక‌త పెరిగిపోయింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ్యాచ్ అయ్యాక టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు ఆమె వ‌ద్ద‌కు నేరుగా వెళ్లి కూర్చున్నారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కాసేపు ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా కోహ్లీ మీద త‌న‌కున్న అభిమ‌నాన్ని ముద్దుతో తెలిపారు. దీనికి సంబందించిన ఫోటోల్ని కోహ్లీ ట్వీట్ లో పోస్ట్ చేశారు.

అంతేకాదు.. మ్యాచ్‌ గెలుపు సందర్భంగా అభిమానులందరూ తమ ప్రేమను.. మద్దతును చూపినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ముఖ్యంగా చారులతాజీ కి. ఆమె వయసు 87.  నేను చూసిన వారిలో క్రికెట్‌ అంటే అంత అభిరుచి ఉన్న అభిమాని ఈమే. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. అభిమానానికి హద్దులుండవు. ఆమె ఆశీర్వాదంతో మరో మ్యాచ్‌కు ముందుకెళతామ‌ని  ట్వీట్ చేశారు.

చారుత‌ల ప‌టేల్ కు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఆమె ద‌శాబ్దాల నుంచి క్రికెట్ అభిఆని. టీమిండియా ఆడిన ప్ర‌తి మ్యాచ్ ను చూశార‌ట‌. 1983లో క‌పిల్ దేవ్ కెప్టెన్సీలో తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ను ముద్దాడిన అపురూప స‌న్నివేశానికి చారుల‌త ప్ర‌త్య‌క్ష‌సాక్షి కావ‌టం విశేషం. ఆ మ్యాచ్ ను తాను ఆ రోజున  స్టేడియంలో చూసిన‌ట్లుగా వెల్ల‌డించారు. కోహ్లీ నేతృత్వంలో భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని తాను గ‌ణేశుడ్ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. మ్యాచ్ అనంత‌రం టీవీలో హైలెట్స్ చూపించే స‌మ‌యంలోనూ చారుల‌త‌ను ప‌దే ప‌దే చూపించ‌టం చూస్తే.. ఆమె ఎంత పాపుల‌ర్ అయ్యారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.


Tags:    

Similar News