వైసీపీలోకి అడారి..విశాఖ జిల్లాలో టీడీపీకి షాక్!

Update: 2019-09-01 16:24 GMT
అనుకున్నంతా అయ్యింది. విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక ఫ్యామిలీగా ఉన్న అడారి కుటుంబం టీడీపీకి షాకిచ్చేసింది. విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న విశాఖ డెయిరీ వ్యవస్థాపకుడు అడారి తులసీరావు కొడుకు  అడారి ఆనంద్ కుమార్ ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయారు. అడారి ఆనంద్ చేరికతో విశాఖ డెయిరీ రైతులంగా ఇకపై వైసీపీ వెంటే నడిచే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అడారి చేరికతో జిల్లాలో వైసీపీకి భారీ లబ్ధి చేకూరనుండగా... ఆ ఫ్యామిలీ అండ  లేని కారణంగా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బే తగలనుందన్న వాదన వినిపిస్తోంది.

అడారి తులసీరావుతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఆది నుంచి టీడీపీ వెన్నంటే ఉంది. డెయిరీ వ్యవహారాలతో సత్తా చాటిన తులసీరావు... విశాఖ జిల్లా వ్యాప్తంగా పాడి రైతుల్లో మంచి పట్టు సాధించారు. అడారి ఎటువైపు ఉంటే... తామంతా అటువైపేనని చెప్పే రైతులు జిల్లాలో లక్షల సంఖ్యలోనే ఉన్నారు. ఆది నుంచి కొనసాగుతూ వస్తున్న అనుబంధంతో అడారి తులసీరావు కొడుకు  అడారి ఆనంద్ కుమార్ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అయితే జగన్ వైపు వీచిన బలమైన గాలిలో అడారి ఓడిపోగా... విశాఖ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించిన వైసీపీ... జిల్లాలో మరింతగా బలపడే దిశగా సాగింది. ఈ క్రమంలో విశాఖ డెయిరీ రైతులను తన వైపునకు తిప్పుకునేందుకు వ్యూహం రచించింది. ఈ క్రమంలో ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావనతో అడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆదిావారం సాయంత్రం తన దగ్గరకు వచ్చిన ఆనంద్ కు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అడారితో పాటు మొన్నటిదాకా టీడీపీలోనే కొనసాగిన పిల్లా రమాకుమారి కూడా జగన్ఖ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

   


Tags:    

Similar News