విశాఖ గ్యాస్ లీక్ విషాదం.. 8మంది మృతి.. అసలేం జరిగిందంటే?

Update: 2020-05-07 04:45 GMT
విశాఖపట్నం లో గ్యాస్ లీక్ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్టు సమాచారం. విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, కేజీహెచ్ లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. 200 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.

*అసలు ప్రమాదం ఎక్కడ?
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.  పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 3 కి.మీల మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. 200 మంది సీరియస్ గా ఉన్నారు.

*రహదారులపై పడిపోయిన ప్రజలు.. దారుణం
గ్యాస్ లీక్ అయ్యి అది పీల్చి చాలా మంది అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయారు. వీరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రజలు తీవ్ర భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు.

* పోలీసుల సైరన్ లు.. ఖాళీ చేయాలని ఆదేశం
విషవాయువు ప్రబలడంతో సైరెన్ లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు ఆ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమకు ఐదు కి.మీల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.  25 అంబులెన్స్ లు, పోలీస్ వాహనాల ద్వారా విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్నారు. సింహాచలం నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు 5 కి.మీల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.

*డ్యూటీకి వచ్చిన కానిస్టేబుల్ అపస్మారక స్థితిలోకి..
ఆర్ఆర్ వెంకటాపురం నుంచి విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చిన కానిస్టేబుల్ కూడా సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎక్కువగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు నురుగులు కక్కుతూ రోడ్డుపై పడిపోయారు.  

*కలెక్టర్, కమిషనర్ రంగంలోకి..
విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా , ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  అధికారులంతా వెంకటాపురం ప్రాంతానికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

*200 మందికి పైగా అస్వస్థత
ఎల్.జీ పాలిమర్స్ సౌత్ కొరియా కంపెనీ. ఇది లాక్ డౌన్ ముగియడంతో తిరిగి ప్రారంభించారు. 3 గంటల సమయంలో స్టెరైన్ వాయువు లీకైంది. ఈ గ్యాస్ తో ప్రాణ నష్టం ఉండదు. సృహ తప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం. ఆక్సిజన్ అందిస్తే కోలుకుంటారు.  200మంది సీరియస్ గా ఉన్నారు.
Tags:    

Similar News