విశాఖకు కేంద్రం కొత్త పేరు పెట్టేసిందే!

Update: 2017-08-06 09:30 GMT
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌కు క‌నీసం రాజ‌ధాని న‌గ‌రం అంటూ కూడా లేకుండాపోయిన ప‌రిస్థితిపై ఏపీ వాసులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన వైనం ఇప్ప‌టికీ మ‌రిచిపోలేనిదే. అయితే అప్ప‌టిదాకా ఉమ్మ‌డి రాష్ట్రానికి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాదును ప‌దేళ్ల పాటు రెండు రాష్ట్రాల‌కు కూడా ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తూ కేంద్రం నిర్ణ‌యం ప్ర‌క‌టించినా... కూడా ఏపీ వాసుల్లో ఆందోళ‌న మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో న‌వ్యాంధ్ర‌కు నూత‌న రాజ‌ధానిని ఖ‌రారు చేసే విషయంపై ఓ కమిటీని వేసిన కేంద్రం... న‌వ్యాంధ్ర ప్ర‌భుత్వం అభిమ‌తానికి అనుగుణంగా గుంటూరు జిల్లా ప‌రిధిలో కృష్ణా న‌దికి ఓ వైపున ఉన్న ప్రాంతానికి అమ‌రావ‌తి పేరు పెట్టేసి న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించేసింది.

ఇప్పుడు ప్ర‌స్తుతం అక్క‌డ రాజ‌ధాని నిర్మాణం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కు అన్న చందంగా సాగుతున్నాయి. మూడేళ్లు గ‌డుస్తున్నా కూడా అక్క‌డ రాజ‌ధానికి ఒక రూపు అంటూ ఏర్ప‌డ‌ని మాట‌ను ఇష్టం లేక‌పోయినా ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాల్సిన విష‌య‌మే. మ‌రి రాష్ట్ర పాల‌న సాగాలి క‌దా. అందుకే అక్క‌డ ఓ స‌చివాలం, ఓ అసెంబ్లీ ప్రాంగ‌ణం అంటూ రెండు తాత్కాలిక నిర్మాణాలు వెల‌శాయి. అయితే పెద్ద పెద్ద స‌మావేశాలు నిర్వ‌హించే ప‌రిస్థితి అక్క‌డ లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తికి అతి స‌మీపంలో ఉన్న విజ‌య‌వాడ‌లోనే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా కొన‌సాగుతున్న ప‌రిస్థితి.

మ‌రి బిజినెస్‌ కు సంబంధించిన స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు విజ‌య‌వాడ‌లో స‌రైన వ‌స‌తులు లేవు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టికే బిజినెస్ కార్య‌క‌లాపాల ప‌రంగా మెరుగైన వ‌స‌తులు ఉన్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్ట‌ణం ఒక్క‌సారిగా లైమ్ లైట్‌ లోకి వ‌చ్చేసింది. ఏపీ ప్ర‌భుత్వానికి సంబంధించి ఏ బిజినెస్ స‌ద‌స్సైనా ఇప్పుడు విశాఖ కేంద్రంగానే సాగుతున్నాయి. ఇటీవ‌ల రెండు సీఐఐ స‌ద‌స్సుల‌కు కూడా విశాఖ‌నే ఆతిథ్య‌మిచ్చిన ప‌రిస్థితి. అంటే న‌వ్యాంధ్ర‌కు బిజినెస్ కేపిట‌ల్‌ గా ఎదుగుతున్న విశాఖకు మ‌రింత ఉన్న‌తంగా తీర్చిదిద్దాల‌న్న వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను ఏపీకి కేటాయించాల‌నే డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ ను అంత‌గా ప‌ట్టించుకోని కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డ ఓ పెట్రోలియం విశ్వ‌విద్యాల‌యానికి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇప్ప‌టికే ఆంధ్రా యూనివ‌ర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ‌స‌తిలో పెట్రో వ‌ర్సిటీ కార్యక‌లాపాల‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధ‌మైపోయింది. మొద‌టి బ్యాచ్ అడ్మిష‌న్లు కూడా పూర్తి అయ్యాయి.

ఇక ఈ వ‌ర్సిటీకి సంబందించిన బిల్లుకు పార్ల‌మెంటులో ఆమోదం తెలిపిన కేంద్రం స‌ద‌రు యూనివ‌ర్సిటీ పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)గా ఖ‌రారు చేసింది. పార్ల‌మెంటులో ఈ బిల్లుపై చ‌ర్చ జ‌రిగిన సంద‌ర్భంగా విశాఖ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌ను పెంచే దిశ‌గా కేంద్రం ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. పెట్రో వ‌ర్సిటీ రాష్ట్రానికి, దేశానికే కాకుండా ప్రపంచానికే ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖ నగరాన్ని ఆయన *ఇండియన్ హూస్ట‌న్‌*'గా అభివర్ణించారు. ఈ సంస్థ ఏర్పాటుకు విశాఖనే అనువైన ప్రాంతం అని కూడా ఆయన అన్నారు.
Tags:    

Similar News