బాబూ...మీ సిట్‌ పై వ‌చ్చిన మాట విన్నారా?

Update: 2017-07-01 04:48 GMT
న‌వ్యాంధ్ర‌కు వాణిజ్య రాజ‌దానిగా ఎదుగుతున్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌తో పాటు ఆ జిల్లా వ్యాప్తంగా వెలుగుచూసిన భూకుంభ‌కోణాల్లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కు ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బాగానే వినిపించాయి. భూ కుంభ‌కోణాల‌పై ఆ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ కేబినెట్ లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు - టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు చాలా ప‌ర్యాయాలు మాట్లాడినా... లోకేశ్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను మాత్రం వారు ఖండించ‌కోపోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే *సేవ్ విశాఖ‌* పేరిట నిర్వ‌హించిన ధ‌ర్నాలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌ర్కారు నుంచి ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌మైన స‌మాధాన‌మే వ‌చ్చిన దాఖ‌లా లేదు.

అయితే భూ కుంభకోణాలు వెలుగులోకి వ‌చ్చాయి గ‌దా... వాటిపై విచార‌ణ చేయ‌కుంటే ప్ర‌భుత్వ ప‌రువు పోతుంద‌నుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబు స‌ర్కారు వీటిపై ఓ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్‌ను వేసిన ప్ర‌భుత్వం... ఆ సిట్ ద‌ర్యాప్తు చేసేందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో మాత్రం పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌న్న వాద‌న వినిపించింది. తొలుత క‌లెక్ట‌రేట్‌ లో ఓ చిన్న గ‌దిని సిట్ కు కేటాయించగా... సింగిల్ డేలోనే ఆ గ‌దిని కాస్తా సిట్ ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. స‌రే ఎక్క‌డో ఒక చోట వ‌స‌తి చూసుకుని సిట్ ద‌ర్యాప్తు మొద‌లు పెడుతుంది గానీ... అస‌లు సిట్ ద‌ర్యాప్తుతో న్యాయ‌మేమైనా జ‌రుగుతుందా? అంటే... అస్సలు న్యాయం జ‌ర‌గ‌దంటున్నారు అక్క‌డి ఓ కీల‌క ఎమ్మెల్యే.

ఆ ఎమ్మెల్యే ఏ విప‌క్షానికో చెందిన నేత కాదు. అధికార టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీ శాస‌న‌స‌భ‌లో బీజేఎల్పీ నేత‌గా, విశాఖ భూ కుంభ‌కోణాల‌ను వెలికితీసిన నేత‌గా మ‌నంద‌రికీ తెలిసిన విష్ణుకుమార్ రాజు. నిన్న విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారు నియమించిన సిట్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖలోనే కాకుండా ప‌రిస‌ర ప్రాంతాల్లో తానే స్వ‌యంగా వెలికితీసిన భూకుంభ‌కోణాల‌పై చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అన్యాయంగా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అస‌లు సిట్ విచార‌ణ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రి విష్ణుకుమార్ రాజు అనుమానాల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News