పవన్ పై బీజేపీ నేతలూ ఫైరవుతున్నారు

Update: 2017-04-14 07:02 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కు ఏపీలో టీడీపీకి మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ పై ఫైరవుతున్నారు. అయితే.. ఈ ట్రెండు ఇంకా ఇప్పుడిప్పుడే మొదలవుతుండడంతో కాస్త పదును తక్కువగానే ఫైరవుతున్నారు. తాజాగా విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పవన్ పై మండిపడ్డారు. ముగిసిన అధ్యాయాల గురించి మాట్లాడుతూ పవన్ సమయం వృథా చేస్తున్నారన్నారు.
    
ప్రత్యేకహోదా కోసం పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తాననడం హాస్యాస్పదమని విష్ణుకుమార్ రాజు అన్నారు.  ‘‘ప్రత్యేకహోదా ఈజ్ క్లోజ్డ్ ఛాప్టర్’’ అని అన్నారు. ప్రత్యేక హోదా మీద ఎవరైనా ఉద్యమం చేస్తామంటే... మళ్లీ సమైక్యాంధ్రపై ఉద్యమం చేసినట్టు ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా పేరు చెప్పి, ప్రజల సమయం వృథా చేయవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతోందని, హోదా కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ఉందని ఆయన తెలిపారు.
    
కాగా పవన్ నిన్న హోదా విషయంలో పలు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.  ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలో లేకపోవడం చాలా బాధాకరమని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాకోసం లోక్‌సభ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేయడం అభినందనీయమని ఆయన నిన్న అన్నారు.  హోదా సాధించాలన్న ఆకాంక్షతో వైకాపా ఎంపీలు బాగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేసిన వార్తకు సంబంధించిన క్లిప్పింగ్‌ను పోస్టుచేశారు. కేంద్రంపై వైకాపా ఎంపీలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారని కితాబిచ్చారు. ఎంతో మంది డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌ ను ఎందుకు విభజించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల విభజన కేవలం దక్షిణాదిలోని ఏపీకి మాత్రమే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు ప్రత్యేక హోదాపై మాట్లాడడాన్ని ఏపీ ఎంపీలు చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. నిన్నటి పవన్ ట్వీట్ల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఇలా ఘాటుగా రెస్పాండయ్యారు. ముందుముందు బీజేపీ కూడా పవన్ పై ఎదురుదాడి పెంచడానికి సిద్ధమవుతోందని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News