బాబు సర్కారును ‘‘విష్ణు’’ అంత మాట అనేశాడే

Update: 2015-12-23 05:18 GMT
మిత్రపక్షం అంటే అధికారపక్షానికి అండగా ఉండటమే. కించిత్ విమర్శలు చేయకుండా మిత్రధర్మాన్ని పాటించటం రాజకీయ న్యాయం. ఒకవేళ అధికారపక్షం ఏదైనా తప్పుచేస్తే.. బాహాటంగా దాన్ని కవర్ చేసి.. అంతర్గతంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయటం రివాజే. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ బీజేపీ నేతలు.. బాబు సర్కారుకు కాస్తంత షాకిచ్చారనే చెప్పాలి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలతో ఏపీ అధికారపక్షం కొద్దిసేపు ఇరుకున పడిన పరిస్థితి.

విశాఖలో కొండ చరియలు విరిగి పడటం కారణంగా జరిగిన నష్టంపై మాట్లాడే సందర్భంలో ఏపీ అధికారపక్షంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అధికారపక్షానికి కాస్తంత ఇబ్బందిని కలిగించాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలుపై ఉన్న ఇళ్లన్నీ అనధికార నిర్మాణాలే అని.. వాటిని తొలగించి.. నివాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీల్లో ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకపోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఎమ్మెల్యేలను గతంలో మాదిరి నిశానీ (వేలిముద్రగాళ్లుగా) అనుకుంటుందా? అంటూ నిలదీశారు.

కమిటీలు ఏర్పాటు చేసేటపుడు అధికారులతో పాటు.. స్థానిక ఎమ్మెల్యేని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటూ ప్రశ్నించిన ఆయన.. ఏపీ సర్కారు తీరుపై తాను చాలా అసంతృప్తితో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. విష్ణు వైఖరిని చూసిన కొందరైతే.. అధికారపక్షానికి మిత్రపక్షంగా ఉంటూనే.. తమ ‘గళాన్ని’ వినిపిస్తున్న విష్ణును స్ఫూర్తిగా తీసుకోవాలని, లోక్ సభలో తమ్ముళ్లు ఇలానే వ్యవహరించాలని.. ఏపీ ప్రయోజనాల విషయంలో బలంగా తమ వాదనను వినిపించటంతో పాటు.. అధికారపక్షానికి అపుడపుడు షాక్ ఇవ్వాలన్న మాట వినిపిస్తోంది.

అయితే, తమ్ముళ్లు గళం విప్పుతామని ముందుకొచ్చినా.. బాబు ఓకే చెబుతారా? అన్నదే పెద్ద ప్రశ్న. ఏమైనా.. విష్ణును తమ్ముళ్లు స్ఫూర్తిగా తీసుకొని లోక్ సభలో తమ వాణిని వినిపిస్తే.. ఏపీకి ఎంతోకొంత లాభం జరగటం ఖాయం.
Tags:    

Similar News