మరీ అంత చెంచాగిరేంటి రాజుగారు?

Update: 2016-05-13 10:08 GMT
ఏపీకి ప్రత్యేక హోదా మీద కుండబద్ధలు కొట్టేసిన బీజేపీ.. చూస్తుంటే విభజన చట్టంలో క్లియర్ గా పేర్కొన్న విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలోనూ హ్యాండ్ ఇచ్చేటట్లు కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఏపీ బీజేపీ నేతల మాటలు ఈ వాదనకు బలం చేకూరేలా ఉండటం గమనార్హం. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలంటూ రూల్స్ ఉన్నాయని.. వాటి ప్రకారమే జోన్ సాధ్యమంటూ ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించటం విశేషం.

ఏ రాష్ట్రంలో అయినా.. తమ రాష్ట్రానికి.. తమ ప్రజలకు మేలు  చేసే అంశాల పట్ల కొంత పక్షపాతంతో నేతలు మాట్లాడటం ఉంటుంది. అదే చిత్రమో కానీ.. ఏపీ నేతలు ఎవరూ తమ ప్రాంత ప్రయోజనాల కంటే కూడా.. పార్టీ ప్రయోజనాలే మిన్న అన్నట్లుగా వ్యవహరించటం ఏమిటో అర్థం కాదు. గౌరవనీయ స్థానంలో ఉన్న విష్ణుకుమార్ రాజు లాంటి వారు.. తమకున్న పలుకుబడితో నయానో.. భయానో లేదంటే బ్రతిమిలాడుకొని అయినా విశాఖకు రైల్వే జోన్ తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి. కానీ.. అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా.. పార్టీ అధిష్ఠానికి కొమ్ము కాసే ధోరణిలో మాట్లాడటం.. రైల్వే జోన్ రావాలంటే ధర్నాలు చేస్తే రాదని వ్యాఖ్యలు చేయటం దేనికి నిదర్శనం?

పార్టీ మీద అభిమానం ఉండటం తప్పేం కాదు. కానీ.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రజల కంటే పార్టీనే మిన్న అన్నట్లుగా వ్యవహరించే తీరును ప్రేమ అనే కన్నా అచెంచాగిరి అనటం సమంజసంగా ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగితే విభజన చట్టంలో లేదని చెప్పే బీజేపీ నేతలు.. మరి చట్టంలో ఉన్న విశాఖ ప్రత్యేక జోన్ అంశాన్ని అమలు చేయటానికి అడ్డొచ్చిందేమిటి? అన్నది పెద్ద ప్రశ్న. విభజన చట్టంలో విశాఖకు రైల్వే జోన్ అంశం ఉన్నది కాబట్టి తామంతా కలిసి జోన్ సాధన కోసం ప్రయత్నం చేస్తామంటూ విష్ణుకుమార్ రాజు చెబుతున్న మాటలు విన్నప్పుడు.. సీమాంధ్రులకు ఇలాంటి నేతలు దొరుకుతారేమిటి? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు.
Tags:    

Similar News