అలనాటి విధ్వంసక క్రికెటర్.. ఒకప్పటి ఫుట్ బాలర్...

Update: 2022-11-22 12:30 GMT
బౌలర్ చేతి నుంచి బంతి జారినదే ఆలస్యం.. ఆకలిగొన్న పులిలా అమాంతం దానిమీద పడిపోయి కసిదీరా కొట్టడంలోమైదానంలో బంతిని చితక్కొట్టడంలో మొన్నటిదాక ఏబీ డివిలియర్స్ గురించి మాట్లాడారు.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పుకొంటున్నారు.. కానీ, ఐదు దశాబ్దాల క్రితమే అతడు అలా చితక్కొట్టాడు. అప్పట్లో టెస్టులే ఎక్కువ. అందులోనూ అతడి విధ్వంసం  మామూలుగా ఉండేది కాదు. క్రీజులో అతడు ఉంటే ఓ నల్ల పులిలా కనిపించేవాడు. అతడి చేతిలోని బ్యాట్.. ఓ మంత్రదండంలా పనిచేసేది. అతడికి బంతి వేయాలంటే సాదాసీదా బౌలర్లకు వణుకే. అయితే, బంతితో అతడి అనుబంధం ఇంకో విధంగానూ ఉంది. అయితే, అది క్రికెట్ మైదానంలో కాదు. ఫుట్ బాల్ గ్రౌండ్ లో. అక్కడా అతడి బంతిని చితక్కొట్టాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరా? అనుకుంటున్నారా? ఇంకెవరు వెస్టిండీస్ మెరుపు వీరుడు వివియన్ రిచర్డ్స్.

ఔనా..? ఇదెలా సాధ్యం..

ప్రపంచ కప్ నేపథ్యంలో ఇప్పుడంతా ఫుట్ బాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అర్జెంటీనా మెస్సీ, పోర్చుగల్ రొనాల్డో గురించి చెప్పుకొంటున్నాం.. అయితే, ఇదే సందర్భంలో వివియన్ రిచర్డ్స్ కూ ఫుట్ బాల్ లో ప్రమేయం ఉందని తెలుసుకోవాలి. అదేంటి అదెలా సాధ్యం అంటారా? ఎందుకు సాధ్యం కాదు..? డివిలియర్స్ కు ఏడెనిమిది క్రీడల్లో ప్రవేశం ఉంది. హాకీలో ఓ స్థాయి వరకు అతడు దేశానికి ఆడాడు. అలాగే రిచర్డ్స్ కూడా. ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు పలు ఆటల్లో ప్రవీణులు అని తెలుసుకోవాలి.

ఇలాంటి అథ్లెట్లు పలు ఈవెంట్లలో పతకాలు కూడా కొట్టారు. టెన్నిస్ ఆటగాళ్లు క్రికెట్‌ ఆడిన ఘటనలు ఉన్నాయి. అయితే, అది ఈ కాలంలో. కానీ యాభై ఏళ్ల కిందట.. అంతగా సదుపాయాలు లేని కాలంలోనే రిచర్డ్స్ ఫుట్ బాల్ లోనూ ఓ కాలేశాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. అతడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విషయమే అందరికీ తెలుసు.

సచిన్ కు ఆరాధ్య ఆటగాడు

1970, 80 దశకాల్లో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ కూడా ఆడాడు. క్రికెట్ ప్రపంచకప్ లు ఆడటానికి ముందే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. రిచర్డ్స్ 1974 లో క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్ కప్ బరిలోకి దిగాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాడు.

కానీ ఆ టోర్నీలో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి వన్డే ప్రపంచకప్ 1975, 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాలుపంచుకున్నాుడు. ఇక్కడ మరో విశేషమేమంటే.. రిచర్డ్స్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఆరాధ్య ఆటగాడు. కెరీర్ లో సచిన్ ను గావస్కర్ ఎంతగానో ప్రోత్సహించినా..రిచర్డ్స్ అంటేనే సచిన్ కు ఇష్టం. ఈ విషయాన్ని అతడు ఎన్నోసార్లు కూడా చెప్పాడు. అయితే, రిచర్డ్స్ కు ఫుట్ బాల్ ప్రవేశం కూడా ఉందని చాలామందికి తెలియదు.

అతడు ఉండుంటే.. 83 ప్రపంచ కప్ భారత్ కు దక్కేది కాదు

1983 వన్డే ప్రపంచ కప్ విజేత భారత్ అని అందరికీ తెలుసు. కానీ, ఆ మ్యాచ్ లో భారత్ చేసిన స్కోరు 183 మాత్రమే. దానిని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ ధాటిగా ఆడింది. ముఖ్యంగా రిచర్డ్స్ తనదైన శైలిలో దూకుడు చూపాడు. కానీ, కపిల్ దేవ్ అద్భుత క్యాచ్ తో అతడి ఇన్నింగ్స్ కు తెరపిడింది. రిచర్డ్స్ కాసేపు క్రీజులు ఉండుంటే.. మనకు కప్ దూరమయ్యేది. కాగా, క్రికెట్ ఆడుతూనే పలు లీగ్ లకు ఫుట్‌బాల్ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే వీరెవ్వరూ రిచర్డ్స్ మాదిరిగా ఫిఫా వరల్డ్ కప్ ఆడలేదు. వారిలో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, చార్లెస్ బర్గెస్ ఫ్రై, డెనిస్ కాంప్టన్ (ఈ ఇద్దరిదీ ఇంగ్లాండ్), ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ కూడా క్లబ్స్ తరఫున ఫుట్‌బాల్ ఆడింది. భారత ఆటగాళ్లలో కూడా చాలా మందికి ఫుట్‌బాల్ ఆటలో మంచి ప్రావిణ్యం ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ముందుగా ఫుట్‌బాల్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News