విశాఖ భూముల అమ్మకాలపై వార్తలు.. హైదరాబాద్ భూముల సేల్ వేళ ఏమైంది?

Update: 2021-07-28 04:14 GMT
ఒకే అంశం రెండు రాష్ట్రాల్లో రెండు రకాలుగా కనిపించటం ఏమిటన్నది తటస్థులకు పెద్ద ప్రశ్నగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న విధానాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒకే మీడియా సంస్థ.. ఒకే అంశాన్ని ఏపీలో ఒకలా రిపోర్టు చేస్తే. తెలంగాణలో మరోలా వార్తలు రాయటాన్ని ఏమనాలి? అన్నదిప్పుడు చర్చగా మారింది. పథకాల వల్ల కానీ.. మరే ఇతర కారణాలతో అయినా కానీ ప్రభుత్వ భూముల్ని అమ్మకాలకు పెట్టిన ఉదంతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా రాతలు రాయటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ రాజధానిగా విశాఖను జగన్ ప్రభుత్వం నిర్ణయించటం తెలిసిందే. ఈ నగరంలోని ప్రభుత్వ భూముల్ని  అమ్మకానికి పెట్టింది జగన్ సర్కారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ ప్రభుత్వ భూముల అమ్మకాలపై.. విశాఖ ఫర్ సేల్ అంటూ షాకింగ్ శీర్షికలతో వార్తలు వచ్చేశాయి. అదే సమయంలో.. ఈ మధ్యన హెచ్ఎండీ హైదరాబాద్ లోని కోకాపేటలోని ప్రభుత్వ భూములకు వేలాన్ని నిర్వహించింది.

ఇందులో రికార్డు స్థాయిలో ధరలు పలికి.. ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఏపీలోని విశాఖలో మాదిరి ప్రభుత్వ భూమిని అమ్మేటప్పుడు ఏ తరహా శీర్షికతో అయితే వార్తలు ఇచ్చారో.. అలాంటి వార్తల్నే ఇవ్వాల్సింది పోయి.. కాసుల వర్షం కురిసిందని.. ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తీసుకొచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. రెండు చోట్ల అమ్మింది ప్రభుత్వ భూమి అయినప్పుడు.. ఒక రాష్ట్రంలో ఒకలా.. మరో రాష్ట్రంలో మరోలా వాదనలు వినిపించటంలో అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలిచే మీడియా.. ఒక చోట ఒకలా.. మరోచోట మరోలా కథనాలు రాయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

పాత రోజుల్లో మీడియా చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడున్నన్ని చానళ్లు.. సోషల్ మీడియా.. యూట్యూబ్ చానళ్లు లాంటివేమీ ఉండేవి కావు. దీంతో.. ప్రధాన మీడియా సంస్థలు చెప్పేవి భగవద్గీతలా కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి మారింది.

చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కెమేరాతో జరిగిన ఉదంతాల్ని ఎంచక్కా వీడియ్ తీస్తున్నారు. దీంతో.. మీడియాలో వచ్చిన వార్తలకు వెంటనే కౌంటర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి అయినా.. ప్రధాన మీడియా సంస్థలు వ్యవహరిస్తే మంచిదంటున్నారు. లేనిపక్షంలో ప్రజాకోర్టులో నిందితుడిగా నిలబడాల్సి ఉంటుందన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News