వైసీపీ మీద ఉక్కు దెబ్బ

Update: 2022-04-24 15:30 GMT
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం గత ఏడాదిన్నరగా చేయని ప్రయత్నం లేదు. అదే సమయంలో ఉక్కు కార్మికులు అంతా రోడ్డు మీదకు వచ్చి వందల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బందులు కూడా  చేశారు. అలాగే రాస్తారోకోలు చేసారు. నిరసలను చేశారు. ఢిల్లీకి వెళ్ళి మరీ గర్జించారు. ఇంతచేసినా కేంద్రం మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. అదే టైమ్ లో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దగా ప్రయత్నాలు ఏవీ లేవని కార్మికులు మండిపోతున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు ఎన్నికలు వచ్చిపడ్డాయి. వైసీపీ కి సంబంధించిన యూనియన్ అయితే పోటీ చేయకుండా కాంగ్రెస్ అనుబంధమైన ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. ఇక స్టీల్ ప్లాంట్ లోపలా ఐఎన్టీయూసీ, బయట వైసీపీ నేతగా చలామణీ అవుతున్న కార్మిక నాయకుడు  మంత్రి రాజశేఖర్ ఐఎన్టీయూసీ ప్యానల్ తరఫున పోటీ చేశారు. మరో వైపు నిన్నటిదాకా గుర్తింపు యూనియన్ గా ఉన్న సీఐటీయూ  పోటీలో ఉంటే ఇంకో ఎనిమిది చిన్న కార్మిక సంఘాలతో కలసి ఏఐటీయూసీ పోటీ చేసింది.

ఏఐటీయూసీకి తెలుగుదేశం పార్టీ కార్మిక అనుబంధ సంఘం టీఎంటీయూసీ మద్దతు ఇచ్చింది. ఈ నేపధ్యంలో వైసీపీ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీతో ఏఐటీయూసీ తలపడింది. ఇక హోరాహోరీగా సాగిన ఈ కీలకమైన  పోరులో మొత్తం తొమ్మిది వేల పై చిలుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓట్లు వేశారు. ఫలితాలు చూస్తే ఏఐటీయూసీకి అనుకూలంగా వచ్చారు.

ఏకంగా ఐఎన్టీయూసీ మీద 466 ఓట్ల తేడాతో ఏఐటీయూసీ గెలిచింది. ఒక విధంగా  ఇది ఘనవిజయమని కార్మికులు అంటున్నారు. ఇక వైసీపీ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ ఓడిపోవడానికి అపవిత్ర పొత్తు ఒక కారణం అయితే మరో వైపు స్టీల్ ప్లాంట్ సమస్యల మీద వైసీపీ సర్కార్ ఏపీలో అధికారాన  ఉండి కూడా పెద్దగా స్పందించకపోవడంతో కార్మికులకు కోపం వచ్చి ఇలా చేశారు అంటున్నరు.

వామపక్షాల అనుబంధమైన ఏఐటీయూసీని గెలిపిస్తే కనీసం తమ పోరాటాలు అయినా గట్టిగా జరుగుతాయని తలచి ఇలా చేశారు అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున కీలక నేతలు అంతా ప్రచారం చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఉక్కు గేటు వద్ద మీటింగ్స్ నిర్వహించారు.

ఇంకో వైపు టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు ఏఐటీయూసీకి మద్దతుగా ప్రచారం చేశారు. మొత్తానికి చూస్తే టీడీపీ మద్దతు ఇచ్చిన ఏఐటీయూసీ గెలవడంతో విశాఖ ఉక్కు కార్మికుల ఉగ్ర రూపం ఏంటన్నది వైసీపీకి తెలియవచ్చింది అంటున్నారు. మరి ఇప్పటికైనా కేంద్రం మీద వత్తిడి పెంచి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోకపోతే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ఉక్కు కార్మికుల ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా గట్టి దెబ్బ వైసీపీకి పడిపోతుంది అని అంటున్నారు.
Tags:    

Similar News