అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు మరో బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళపై ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో చార్జిషీటు దాఖలయింది. జేజే టీవీ చానల్ వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అభియోగాలను నమోదు చేసింది. జైలులో ఉన్న శశికళను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎ జకీర్ హుసేన్ విచారించారు.
శశికళ, ఆమె బంధువు వి భాస్కరన్ - జేజే టీవీకి సంబంధించి 1995 - 1996కు సంబంధించి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు నమోదు చేసింది. నిధులు అక్రమ మార్గాలద్వారా విదేశాలకు తరలించారని తెలిపారు.బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను జైలు నుంచే విచారించడానికి మే నెలలో కోర్టు అనుమతి ఇచ్చింది.
మరోవైపు అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ మరోమారు తన మేనత్తను కలుసుకున్నారు. పరప్పణ అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన మేనత్త శశికళతో ఆయన ములాఖాత్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులతో పాటూ వ్యక్తిగత అంశాలపై శశికళతో ఆయన మాట్లాడారని సమాచారం. రెండాకుల కేసులో అరెస్టయి బెయిల్ పై వచ్చిన ఆయన రెండోసారి శశికళను కలిశారు. అన్నాడీఎంకేలో దినకరన్ తో పాటూ శశికళ కుటుంబ సభ్యలు ప్రాభవం తగ్గింది. వారందరినీ పార్టీకి దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మేనత్త శశికళతో దినకరన్ చర్చించినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/