ఆడాళ్లంటే పుతిన్‌ కు మ‌రీ అంత చుల‌క‌నా?

Update: 2017-06-08 07:10 GMT
వివాదాల‌తో స‌హ‌జీవ‌నం చేయ‌టం కొంద‌రికి స‌ర‌దా. అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు వీలైనంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది పోయి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి లేనిపోని స‌మ‌స్య‌ల్ని ఆహ్వానించే తీరు కొంద‌రు అధినేత‌ల్లో క‌నిపిస్తుంటుంది. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తారు రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. తాజాగా మ‌హిళ‌ల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేపాయి.

ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా మ‌హిళ‌ల్ని చిన్న‌బుచ్చేలా..వారి మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ తినేలా చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మ‌రీ అంత బ‌లుపా? అంటూ తిట్ల దండ‌కం అందుకున్న వారు సైతం లేక‌పోలేదు.

తాను మ‌హిళ‌ను కాన‌ని.. అందుకే త‌న‌కు చెడు రోజులంటూ ఏమీ ఉండ‌వంటూ చేసిన వ్యాఖ్య‌లపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో.. తాను మ‌హిళ‌ల్ని కించ‌ప‌ర్చ‌లేద‌ని.. ప్ర‌కృతిప‌రంగా జ‌రిగేది మాత్ర‌మే తాను చెప్పిన‌ట్లుగా చెప్పి స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇంత‌కీ ఈ వివాదం ఎక్క‌డ షురూ అయ్యిందంటే.. అస్కార్ అవార్డు గ్ర‌హీత‌.. హాలీవుడ్ ఫిలిం మేక‌ర్ ఓలివ‌ర్ స్టోన్ ..ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మీద ఒక డాక్యుమెంట‌రీ తీయాల‌ని ప్లాన్ చేశారు. నాలుగు ఎపిసోడ్ల‌పై ఈ డాక్యుమెంట‌రీని తీయాల‌ని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా పుతిన్ తో క‌లిసి మాస్కో న‌గ‌రంలో స‌మావేశ‌మ‌వుతున్నారు.

కీల‌క ప‌ద‌వుల్లో ఉంటూ బాధ్య‌త‌లు ఎలా నిర్వ‌హిస్తున్నారంటూ ఓలివ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు పుతిన్ బ‌దులిస్తూ.. త‌న‌కు చెడు రోజులంటూ ఏమీ ఉండ‌వ‌ని.. క‌ష్టాలు రావ‌ని..ఎందుకంటే తాను మ‌హిళ‌ను కాద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదంగా మారాయి. దీంతో.. కాస్త స‌ర్దుకున్న పుతిన్ త‌న మాట‌ల‌కు ఎలాంటి బాధ‌ను వ్య‌క్తం చేయ‌కుండా.. తాను మ‌హిళ‌ల్ని కించ‌ప‌ర్చాల‌ని అస్స‌లు అనుకోవ‌టం లేద‌ని మాత్రం చెప్పారంతే. ఇదిలా ఉంటే.. మ‌హిళ‌లు మాత్రం.. మేం అంటే మ‌రీ అంత చుల‌క‌నా? అంటూ ఫైర్ అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News