మూడేళ్ల త‌ర్వాత డీజిల్‌.. పెట్రోల్ కార్లు బంద్!

Update: 2017-07-06 05:12 GMT
ఎవ‌రూ ఊహించని ప్ర‌క‌ట‌న‌తో షాకిచ్చింది ప్ర‌ఖ్యాత వాహ‌నాల సంస్థ వోల్వో. చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా ఒక ప్ర‌ముఖ కార్ల కంపెనీ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్. మూడంటే మూడేళ్ల వ్య‌వ‌ధిలో తాము కేవ‌లం బ్యాట‌రీతో న‌డిచే కార్ల‌ను మాత్ర‌మే ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం త‌యారు చేస్తున్న కంబ‌ష‌న్ ఇంజిన్ త‌యారీని పూర్తిగా నిలిపివేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది.

స్వీడ‌న్‌కు చెందిన వోల్వో చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు మార్కెట్లో సంచ‌ల‌నం. సంప్ర‌దాయ ఇంధ‌నాలైన డీజిల్‌.. పెట్రోల్ తో న‌డిచే వాహ‌నాల వాటాతో పోలిస్తే.. పూర్తిగా విద్యుత్ ఆధారంగా న‌డిచే కార్లు చాలా.. చాలా త‌క్కువ‌. నేచ‌ర్ ఫ్రెండ్లీగా ఉండాల‌న్న ఉద్దేశంతో తామీ భారీ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా వోల్వో ప్ర‌క‌టించింది.

త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ గురించి ప్ర‌క‌టించిన కంపెనీ.. 2019-2021 మ‌ధ్య‌న వంద శాతం విద్యుత్ కార్ల‌కు సంబంధించి ఐదు మోడ‌ళ్ల‌ను మార్కెట్లోకి తీసుకురానున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. 2025 నాటికి మిలియ‌న్ విద్యుత్ కార్ల‌ను అమ్మ‌ట‌మే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా వెల్ల‌డించింది.  వోల్వో ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో.. వాహ‌న దిగ్గ‌జాలు ఇదే బాట‌లో ప‌య‌నిస్తాయా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఉన్న‌ట్లుండి ప‌ర్యావ‌ర‌ణం మీద కార్ల కంపెనీల‌కు ఇంత ప్రేమ ఎందుకు పొంగి పొర్లుతుంద‌న్న‌ది చూస్తే.. విద్యుత్ వాహ‌న మోడ‌ళ్ల వ్య‌యం.. సంప్ర‌దాయ వాహ‌నాల వ్య‌యంతో పోలిస్తే త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాలుష్య నివార‌ణ ప‌రిమితులు క‌ఠినంగా మార‌టం.. బీఎస్ 6.. యూరో 6 లాంటి ఉద్గార ప్ర‌మాణాలు అంత‌కంత‌కూ క‌ఠినం అవుత‌న్న వేళ‌.. డీజిల్‌.. పెట్రోల్‌కార్ల త‌యారీ త‌ల‌కు మించిన భారంగా మార‌నుంది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌టానికి వీలుగా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

తాజాగా వోల్వో త‌న భ‌విష్య‌త్ ప్లాన్‌ను ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తినా.. రానున్న రోజుల్లో మిగిలిన కార్ల కంపెనీలు సైతం వోల్వో అడుగుల్లోనే న‌డిచే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో విద్యుత్ కార్ల‌కు ఇప్పుడు ఆద‌ర‌ణ పెర‌గ‌టం.. వాహ‌న‌దారులు సైతం విద్యుత్ వాహ‌నాల మీద మ‌క్కువ పెంచుకోవ‌టం కూడా కంపెనీలు ఆ వైపు దృష్టి సారించేలా చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో విద్యుత్ కార్ల అమ్మ‌కాలు పుంజుకుంటున్నాయి. 2005లో వంద‌ల సంఖ్య‌లో ఉన్న అమ్మ‌కాలు ఇప్పుడు వేల సంఖ్య‌కు చేరుకోవ‌టం గ‌మ‌నార్హం. కొన్ని దేశాల్లో విద్యుత్ కార్ల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. దీనికి నార్వేనే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. గ‌త ఏడాది ఆ దేశంలో మొత్తం కార్ల అమ్మ‌కాల్లో విద్యుత్ కార్ల అమ్మ‌కాల వాటా 15.7 శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ కార‌ణంగానే విద్యుత్ కార్ల త‌యారీ మీద పెద్ద కంపెనీలు సైతం దృష్టి  సారిస్తున్నాయి. ఈ అంశాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న వోల్వో.. మిగిలిన వారి కంటే ముందుగా సంప్ర‌దాయ ఇంధ‌నంతో న‌డిచే కార్ల త‌యారీకి క‌టీఫ్ చెప్పేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. వోల్వో నిర్ణ‌యం అనంత‌రం మిగిలిన కార్ల కంపెనీలు అదే బాట‌లో న‌డిచే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. భార‌త్ ప‌రిస్థితి ఏమిటి? ఇక్క‌డి కంపెనీల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయ‌న్న‌ది చూస్తే.. 2030 నాటికి అంటే.. మ‌రో 13 ఏళ్ల వ్య‌వ‌ధిలో దేశ వ్యాప్తంగా విద్యుత్ కార్ల‌ను మాత్ర‌మే న‌డిపేలా చేయాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ణాళికలు సిద్ధం చేస్తోంది. వోల్వో ప్ర‌క‌ట‌న‌కు ముందు.. ఈ ఫ్యూచ‌ర్ ప్లాన్ విన్న వారంతా సాధ్య‌మ‌య్యేనా అనుకున్నా.. తాజా ప‌రిణామాలు చూసిన‌ప్పుడు మాత్రం భార‌త స‌ర్కారు ఆశ‌లు అసాధ్య‌మైన‌వేమీ కాద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మొత్తంగా చూస్తే.. రానున్న ద‌శాబ్ద వ్య‌వ‌ధిలో కార్ల‌కు సంబంధించి విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకోనున్నాయ‌న్న మాట‌.
Tags:    

Similar News