వినాయక్ ఫ్రేమ్ లో : బాబుకు కొడాలి నాని మధ్యన ఏముందో...?

Update: 2022-07-26 04:01 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీయార్ నుంచి పార్టీని తీసుకుని సీఎం అయినపుడు కొడాలి నాని బహుశా రాజకీయాల్లోనే ఉండి ఉండరు. ఉంటే గింటే ఆయన ఎన్టీయార్ కి పెద్ద ఫ్యాన్ గా ఉంటారు. అదే సమయంలో టీడీపీకి వీరాభిమానిగా ఉంటారు. ఇక తన గుడివాడలో టీడీపీ వారి గెలుపునకు కృషి చేసి ఉంటారు. అయితే కొడాలి నానికి ఆది నుంచి ఎన్టీయార్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. ప్రత్యేకించి నందమూరి హరిక్రిష్ణతో మంచి అనుబంధం ఉంది.

అది కాస్తా జూనియర్ ఎన్టీయార్ వరకూ కూడా విస్తరించింది. ఇక గుడివాడ నుంచి నాని మొదటిసారి 2004లో పోటీ చేశారు. అపుడు హరిక్రిష్ణ మద్దతుతో టికెట్ వచ్చింది. ఇక 2009లో కూడా మరోసారి టికెట్ నానికే దక్కింది. అది కూడా జూనియర్ ఎన్టీయార్ జోక్యంతో వచ్చింది అని తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్యూలో నానితో సన్నిహిత పరిచయం ఉన్న సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ చెప్పారు.

ఆనాడు కొడాలి నాని టికెట్ కోసం తానూ జూనియర్ ఎన్టీయార్ చంద్రబాబు వద్దకు వెళ్ళామని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక ఆ తరువాత కొడాలి నాని వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది చంద్రబాబుకు కొడాలి నానికి మధ్య ఏముంది అని. ఇద్దరూ ఒకే సామాజికవర్గం. ఇద్దరూ కూడా టీడీపీనే. పైగా రెండు సార్లు నానికి టికెట్ ఇచ్చింది చంద్రబాబు. నాని కూడా బాబు నాయకత్వాన పనిచేశారు. మరి ఇలాంటి వేళ ఉంటే గింటే రాజకీయ విమర్శలే ఉండాలి. కానీ దాన్ని దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అంటే నానికి బాబుకు మధ్య అంతకుమించి ఏదో వైరమే ఉండాలి కదా.

ఇదే పాయింట్ మీద వీవీ వినాయక్ ఆ చానల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే నిజమే నాని చంద్రబాబుని దారుణంగా విమర్శిస్తారు.అంతే కాదు అంతరంగిక సంభాషణలలోనూ బాగా మాటలు అంటారు. ఎందుకో నానికి బాబు మీద కోపం మాకు కూడా అర్ధం కాదు అని వినాయక్ చెప్పుకొచ్చారు.  ఇక నానికి చంద్రబాబు అంటే ముందు నుంచి పడదని మాత్రం వినాయక్ కొత్త పాయింట్ చెప్పారు.

ఎన్టీయార్ అంటే నానికి చాలా అభిమానమని, ఆయన కోసం పీక కోసుకునేంత పిచ్చి అభిమానం అని కూడా చెప్పుకొచ్చారు. బహుశా ఎన్టీయార్ విషయంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే నానికి నచ్చి ఉండకపోవచ్చు అని వినాయక్ తనదైన విశ్లేషణ వినిపించారు. అయితే అది 1995లో జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్. కానీ 2004, 2009లలో చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ ద్వారానే కదా నాని ఎమ్మెల్యే అయింది. పనిచేసింది అన్న డౌట్ కూడా ఉంది అందరికి.

అయితే దీనికి కూడా జవాబు ఉంది. ఏ రోజూ చంద్రబాబు నానిని పిలిచి టికెట్ ఇవ్వలేదు. హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీయార్ ల వల్లనే టికెట్ ఆయనకు దక్కింది. అంటే బాబుకు ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద ఇచ్చారు అన్నదే నాని భావన. అందుకే ఆయనకు ఆ కృతజ్ఞత అయితే నందమూరి ఫ్యామిలీ మీద ఉంది కానీ బాబు మీద లేదు అంటారు. మరో వైపు చూస్తే నాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు. జస్ట్ ఎమ్మెల్యేగానే ఆయన ఉన్నారు. అలా టీడీపీ నుంచి కూడా ఆయనకు ఏమీ అధికార లాభం కలగలేదు అని కూడా చెప్పుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు రాజకీయ  పోకడలు వెన్నుపోటు వ్యవహారాలు అన్నవి  ఇష్టం లేకనే నాని ఇలా ఆయన‌ మీద విమర్శలు చేస్తున్నారని, అవి శృతి మించి వ్యక్తిగతంగా మారిపోయాయని అంటున్నారు. మొత్తానికి నాని సన్నిహితులు కూడా నొచ్చుకునేలా బాబుని చెడుగుడు ఆడుకుంటున్న నాని ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అనే చెప్పాలి
Tags:    

Similar News