ఆరెస్సెస్ చీఫ్ వర్సెస్ కపిల్ సిబల్.. మాటల యుద్ధం..!

Update: 2023-01-11 07:44 GMT
దేశంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయని వారంతా ఆందోళన చెందుతున్నారని మీడియా వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

"హిందూస్థాన్ (ఇండియా) హిందూస్థాన్ గానే ఉంటుందని.. ఇక్కడి ముస్లింలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని" ఆరెస్సెస్ పత్రిక పాంచజన్య.. ఆర్గనైజర్లకు ఇచ్చిన ఇంటర్వూలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఒకప్పుడు దేశాన్ని పాలించారని.. మళ్లీ పాలిస్తామనే ఆధిపత్య భావజాలాన్ని వారంతా వదులుకోవాలని ఆయన సూచించారు.

దేశంలోని ముస్లింలు.. మైనార్టీలు.. కమ్యూనిస్టులు ఎవరైనా సరే ఈ భావజాలాన్ని వదులుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ నేత.. ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు.

హిందుస్తాన్ హిందుస్తాన్ గానే ఉంటుందన్న వ్యాఖ్యలపై కపిల్ సిబల్ సైటర్లు వేశారు. హిందుస్థాన్ హిందుస్థాన్ గా ఉన్నప్పుడు మనుషులు.. మనుషుల్లాగా ఉండాలి కదా? అంటూ నిలదీశారు. భగవత్ ఓవైపు అందరినీ కలుపుకొని పోతామని చెబుతూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

భగవత్ వ్యాఖ్యలు ముస్లింలపై దాడులను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆరెఎస్సెస్ మద్దతుదారులు సైతం కపిల్ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాడి వేడి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో వేచిచూడాల్సిందే..!  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News