కేసీఆర్‌-బాబు దోస్తీకి అడ్డువ‌స్తున్న చిక్కు అదే

Update: 2015-11-12 05:45 GMT
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఆంధ్ర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారా? ఇందుకోసం ప్ర‌తిష్టాత్మ‌క వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ను సైతం లైట్ తీసుకుంటున్నారా? మొన్నటివరకు ఢీ అంటే ఢీ అనుకున్న ఈ ఇద్దరి నేతల మధ్య స‌ఖ్య‌త నిజ‌మేనా?  వారిద్ద‌రి మ‌ధ్య చిగురించిన మైత్రిని చిదిమేసే ప‌రిణామం తాజాగా ఏం జ‌రిగింది? ఇవ‌న్నీ తాజాగా ఇరు రాజ‌కీయవ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విభ‌జ‌న‌తో మొద‌లైన విభేదాలు ఓటుకు నోటుతో తారాస్థాయికి చేరాయి. దీంతో ఇద్ద‌రు సీఎంలు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పైచేయి సాధించేందుకు పోటీపడ్డారు. వీరి విభేదాలు తారాస్థాయికి చేరుకోగా తెలుగు ప్రజల మధ్య కూడా ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. అయితే... చంద్రబాబు విజయవాడకు మకాం మార్చడంతో గత రెండు నెలలుగా శాంతియుత వాతావరణం నెలకొంది. ఇదిలాఉండగా, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబే స్వయంగా కేసీఆర్‌ ను ఆహ్వానించడంతో ఇద్దరి మధ్య సఖ్యత వాతావరణం నెలకొంది. శంకుస్థాపన సమయంలో కేసీఆర్‌ కు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం, నవ్వుతూ మాట్లాడుకోవడం పట్ల తెలుగు ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్‌ - చంద్రబాబు స్నేహితులుగా మారితే బాగుంటుందని రాజకీయ పరిశీలకులతోపాటు ప్రజలు కూడా ఆశిస్తున్నారు.

ఇదిలాఉండగా ఇప్పుడే చిగురించిన ఈ స్నేహానికి బీట‌లు వార్చేలా తాజా ప‌రిస్థితి వ‌చ్చింది అదే వరంగల్‌ లోక్‌ సభ ఉపఎన్నిక. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పార్టీలైన టీడీపీ-టీఆర్ ఎస్‌ ల త‌మ త‌మ నాయ‌కుల‌ను నిల‌బెట్టాయి. కాక‌పోతే టీడీపీ ఎన్డీఏ కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. ఇపుడే ఈ ప‌రిణామ‌మే తెలంగాణ సీఎం కేసీఆర్‌- ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య వివాదం సద్దుమణుగుతున్న తరుణంలో ఎటు దారితీస్తుందోనన్న అనుమానం వ్యక్తమ‌వుతోంది. మరోవైపు రాజకీయంగా కూడా వివాదాలు సృష్టించుకోకుండా కొన్నాళ్ళ పాటు శాంతియుతంగా కొనసాగితేనే తెలంగాణలో తమకు ప్రయోజనం కలుగుతుందని పార్టీ నేతలు కొందరు చంద్ర‌బాబుకు సూచించినట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాలను స్థానిక నాయకులే చూసుకోవాలని ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్ర‌బాబు సూచించారు.వివాదాస్పదమైన రాజకీయ వ్యవహారాల జోలికి పోకుండా కేవలం ప్రభుత్వపరమైన అంశాల పరిష్కారం పైనే దృష్టి సారిస్తానని స్పష్టంచేశారు. దీంతో కేసీఆర్‌ తో వివాదాలు కొనితెచ్చుకోకుండా సర్దుకుపోవాలన్న రీతిలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  అయితే రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, వివాదాలపై తాను కేసీఆర్‌ తో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమన్న సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు.

ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారంలోకి దిగితే కేసీఆర్‌ పై -టీఆర్ ఎస్ పై విమర్శలు - ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇది మళ్ళీ ఘర్షణ వాతావరణానికి దారితీసే ప్రమాదం ఉన్నందున అందుకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ టీడీపీ నేతలకు ఇప్పటికే బాబు సూచించారు. అయితే చంద్రబాబు మౌనంగా ఉంటే కేసీఆర్‌ ను ఎదుర్కోవడం తమకు కష్టసాధ్యమేనంటూ కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారని స‌మ‌చారం. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.
Tags:    

Similar News